ఫార్మ'ఛీ' | Rules Breaking In pharmacy Shops YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఫార్మ'ఛీ'

Sep 10 2018 1:06 PM | Updated on Sep 10 2018 1:06 PM

Rules Breaking In pharmacy Shops YSR Kadapa - Sakshi

బద్వేలులోని ఒక మందుల దుకాణం

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు: పోరుమామిళ్లకు చెందిన ఒక వ్యక్తి కాళ్లు, చేతులు నొప్పి ఉండటంతో ఔషధ దుకాణానికి వెళ్లారు. దుకాణంలోని వ్యక్తికి తన సమస్య చెప్పి మాత్రలు అడిగారు. అతను ఇచ్చిన మాత్రలు వేసుకున్న తరువాత శరీరమంతా దద్దుర్లు, దురద వచ్చాయి. దీంతో వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లగా తాను వేసుకున్న మాత్రలు రియాక్షన్‌ ఇవ్వడంతో ఇలా జరిగిందని ఆయన చెప్పారు. ఫార్మసీ దుకాణంలో ఉన్న వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం, ఫార్మసిస్టు కాకపోవడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి చాలా పట్టణాల్లో రోజూ చూడవచ్చు. జిల్లాలోని అధికశాతం ఔషధ దుకాణాల్లో కనీసం ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. డిప్లొమో, బీఫార్మసీ చదువుకున్న వారికిసంబంధించిన సర్టిఫికెట్లు కంట్రాక్టు పద్ధతిన తీసుకుని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల్లో అవగాహన లేని వ్యక్తులను ఉంచి మందుల అమ్మకాలు సాగిస్తున్నారు.

అద్దెకు సర్టిపికెట్లు : జిల్లాలోని అధికశాతం ఫార్మసీ దుకాణాల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే డాక్టరు రాసిన ప్రిస్కిప్షన్‌కు సరైన మందులు ఇవ్వగలరు. చాలా దుకాణాల్లో కనీస అవగాహన లేని వ్యక్తులు ఉంటున్నారు. జిల్లాలో 1250 పైగా ఫార్మసీ దుకాణాలు, 350 హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. కడప డివిజన్‌లో 700, ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో 550 ఫార్మసీ దుకాణాలు ఉండగా వీటి ద్వారా రోజుకు రూ.7 కోట్లపైనే లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. సగానికి పైగా దుకాణాల్లో ఫార్మసిస్టులు లేకుండానే అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుం ది. బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదువుకున్న వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని లామినేషన్‌ చేయించి షాపుల్లో తగిలిస్తున్నారు. సరిఫికెట్‌దారుడు వాస్తవంగా మరోచోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. సర్టిఫి కెట్‌ ఇచ్చినందుకు డిప్లొమో అభ్యర్థులకు నెలకు రూ.2వేలు, బీఫార్మసీ వారికైతే నెలకు రూ.3 వేల వరకు ఇస్తున్నారు. దుకాణాలు, కార్పొరేట్‌ స్థాయి మెడికల్‌ షాపుల్లో కూడా ఇదే పరిస్థితి. ఔషధ నియంత్రణ మండలి అధికారులు మాత్రం తూతూమంత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు పాటిస్తే ఒట్టు
చాలా ఔషధ దుకాణాల్లో ఏసీ సదుపాయం ఉండదు. నిబంధనల ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో మందులు దాచిపెట్టి స్టోరేజీ చేయాల్సి ఉన్నా అది ఏ దుకాణంలోనూ కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ మందులను సర్దేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మెజార్టీ షాపుల్లో సైతం ఇదే దుస్థితి. ఫార్మసీ నిర్వాహకులు, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు పట్టవు. మందుల అమ్మకాలు సైతం ఇష్టారాజ్యంగా సాగితున్నాయి. రోగ నివారణకు ఉపయోగించే మందులకు సరైన స్టోరేజీ లేకపోవడంతో అవి విషపూరితంగా మారుతున్నాయి. కొన్ని రకాల క్రీములు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, అయింట్‌మెంట్‌లు తగిన ఉష్ణోగ్రతలో తప్పనిసరిగా ఉంచాలి. రిప్రిజిరేటర్‌ ఉష్ణోగ్రత రెండు నుంచి ఎనిమిది డిగ్రీలు, ఫార్మసీలో ఏసీ ఉష్ణోగ్రత 25–30 డిగ్రీల మధ్య ఉండాలి.

ఏసీ, రిఫ్రిజిరేటర్‌ ఉంటేనే అనుమతి
ప్రతి ఔషధ దుకాణంలో రిఫ్రిజిరేటర్, ఏసీ ఉండాల్సిందే. అవి ఉంటేనే ఔషధ నియంత్రణ సంస్థ డ్రగ్‌ లైసెన్స్‌ ఉండాలి. చాలా ఫార్మసీల్లో ఇవి కనిపించవు. క్యాన్సర్, గుండె, న్యూరాలజీ, మధుమేహం వంటి కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ఏసీ, రిఫ్రిజిరేటర్‌ సదుపాయం ఉన్న చోటనే నిల్వ చేయాలి. హార్మోన్లు, ఎంజైమ్స్‌కు సంబంధించిన ఔషధాలు సూచించిన ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. లేకపోతే మందుల సామర్థ్యం తగ్గిపోతోందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement