సర్కారు చేతిలో ‘స్టీరింగ్’ | RTC Drivers Suspended welfare schemes | Sakshi
Sakshi News home page

సర్కారు చేతిలో ‘స్టీరింగ్’

Feb 28 2016 11:43 PM | Updated on Sep 3 2017 6:37 PM

జీవిత సంద్రాన్ని ఈదడం కోసం పగలనక, రాత్రనక భార్యాబిడ్డలను విడిచిపెట్టి స్టీరింగ్ పట్టుకుని వాహనాలను

 విజయనగరం క్రైం:జీవిత సంద్రాన్ని ఈదడం కోసం పగలనక, రాత్రనక భార్యాబిడ్డలను విడిచిపెట్టి  స్టీరింగ్ పట్టుకుని వాహనాలను నడిపే డ్రైవర్లను  ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దవుతాయని  ప్రకటించడంతో ఆ  డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.   జీవన యానాన్ని సాగించడం కోసం అప్పోసప్పో చేసి కొంతమంది కార్లు, టాటా మాజిక్ తదితర నాలుగు చక్రాల వాహనాలను  కొనుక్కుని బతుకులీడుస్తున్నారు.
 
  నాలుగు చక్రాల వాహనాలకు ప్రభుత్వం   రుణాలు అందించకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ద్వారా ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుని  కాలం గడుపుతు న్నారు. అసలే వాహనాల కొనుగోలుకు చేసిన అప్పులు తీరక వారంతా సతమతమవుతుంటే పులి మీద పుట్రలా నాలుగు చక్రాలు ఉన్న వారికి  సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో  డ్రైవర్లకు దిక్కుతోచడం లేదు.    కొనుగోలు చేసిన వాహనాలకు అధికస్థాయిలో అప్పులు తీసుకుని నెలనెల ఫైనాన్స్ కట్టే సరికి  జీవితం తెల్లారిపోతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ట్రావెల్స్ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న కార్లను పరిగణనలోకి తీసుకుంటే  తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
 
 ఇంటికో  ఉద్యోగం..నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి మాటలు పక్కన పెట్టినప్పటికీ..ఎలాగోలా బతుకులీడుస్తున్న తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని వాపోతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాలుగు చక్రాల  వాహనదారుల విషయంలో పూర్తిగా పరిశీలించాలని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.  డ్రైవర్లు తమ జీవితాలను బాగుచేసుకోవడం కోసం కార్లను కొన్నవారిని కాకుండా కార్లను  విలాసం కోసం కొన్ని వారిని.. వారి ఆర్థిక  స్థితిగతులను అంచనా వేసుకుని సంక్షేమ పథకాలు రద్దు చేయాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు.
 
 స్పష్టత లేని  ప్రభుత్వ నిర్ణయం
 నాలుగు చక్రాల వాహనాలు అంటే విలాసం కోసం కార్లు కొన్నవారికా..ట్రావెల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న కార్లు.. టాటా మేజిక్ తదితర వాహనాలా అన్న విషయంపై ప్రభుత్వం ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, చంద్రబాబు  ఎక్కడా లేని నిర్ణయాలను తీసుకుని డ్రైవర్లను  ఇబ్బంది  పెడుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement