కూలీల కష్టం నీటి పాలు!

Rs. 9,862 crores misuse in Employment Guarantee Scheme - Sakshi

‘ఉపాధి’ లో రూ. 9,862 కోట్లు దుర్వినియోగం

నిబంధనలకు విరుద్ధంగా నీరు– చెట్టుకు మళ్లింపు

పొక్లెయిన్లతో మట్టి తవ్వి కూలీలు పనులు చేసినట్లు బిల్లులు 

చెరువుల్లో మట్టిని విక్రయించి కోట్ల రూపాయలు గడించారు 

ఉపాధి హామీ పథకం నిబంధనలకు టీడీపీ సర్కారు తూట్లు 

ఇష్టానుసారంగా మార్చేసి జీవోలిస్తోందని కేంద్రం ఆగ్రహం

వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. రాష్ట్రానికిచ్చిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని, గత మూడేళ్లలో రూ.9,862 కోట్లు దుర్వినియోగం చేశారని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఉపాధి హామీ అమలును పర్యవేక్షించే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ (నంబర్‌  హెచ్‌– 11012– 21–2018) రాశారు. 

నాలుగున్నరేళ్లలో రూ.20,634 కోట్లు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నర ఏళ్లలో ఉపాధి  పథకం అమలుకు కేంద్రం రూ. 20,634 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ  తేదీ నుంచి ఇప్పుటి వరకు ఐదు నెలల కాలానికే రూ. 5,753 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉపాధి హామీ పథకం అమలుకు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద ఏ పనులు చేపట్టాలి? వేటిని చేపట్టకూడదనే అంశాలపై కేంద్రం స్పష్టమైన విధివిధానాలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

నిబంధనలకు విరుద్ధంగా జీవోలతో మళ్లింపు
ఉపాధి పథకం నిధులతో చేపట్టే ఏ పని అయినా కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా కేవలం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేయాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ఉపాధి నిధులను సాగునీటి పనులకు వ్యయం చేసిందని కేంద్ర అధికారులు లేఖలో పేర్కొన్నారు. నీరు– చెట్టు పేరుతోప్రొక్లెయిన్లతో చిన్న తరహా సాగునీటి చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి అందుకు ఉపాధి నిధులను చెల్లించారని కేంద్రం లేఖలో పేర్కొంది.

మట్టినీ మింగేశారు!
రూ. 9,862 కోట్ల ఉపాధి హామీ నిధులను సాగునీటి చెరువుల్లో మట్టి వెలికి తీసే పనులకు ఖర్చు పెట్టడంతో పాటు భారీ పరిమాణంలో తవ్విన మట్టిని ఎక్కడ ఉపయోగించారో వివరాలు లేకపోవడాన్ని కేంద్రం తప్పుబట్టింది. చెరువుల నుంచి వెలికి తీసిన మట్టిని కాంటాక్టర్లు రూ.వేల కోట్ల కు విక్రయించినట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. 

సోము వీర్రాజు లేఖతో కదలిక..
ఉపాధి హామీ పథకంతో పాటు నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో భారీగా అవినీతి జరుగుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వ్రీరాజు గత ఆగస్టు 1వ తేదీన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే కార్యక్రమంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివరాలను సేకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తమ దృష్టికి వచ్చిన అంశాలపై ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top