
రూ. 645 కోట్లతో అభివృద్ధి
ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 645 కోట్లతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రపంచ బ్యాంకు బృందం టీమ్‌లీడర్ అలోక్ పట్నాయక్ తెలియజేశారు.
- ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు
- బందరు మండలంలో తుపాను షెల్టరు పరిశీలన
- టీమ్‌లీడర్ అలోక్‌పట్నాయక్
చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 645 కోట్లతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రపంచ బ్యాంకు బృందం టీమ్‌లీడర్ అలోక్ పట్నాయక్ తెలియజేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు బుధవారం బృందం మచిలీపట్నం వచ్చింది. అనంతరం బందరు మండలంలోని మాలకాయలంక, తాళ్లపాలెంలో తుపాను షెల్టర్ల నిర్మాణాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాట్లాడారు. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎన్‌సీఈఆర్పీ) ద్వారా రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో రూ. 645 కోట్లతో 559 అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. వీటిలో 138 తుపాను షెల్టర్లు, 265 రహదారులు, 23 వంతెనలు, రెండు కరకట్ట నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం గత నాలుగు రోజులుగా పురోగతిలో ఉన్న పనులను పరిశీలించిందని, వీటిలో కొన్ని పనులు రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసేకునే అవకాశం ఉందన్నారు.
మిగిలిన పనులన్నీ 2015 మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేశామన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ పనులను ఆయా గ్రామాల ప్రజలు చొరవ తీసుకుని నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని సూచించారు. పనుల్లో నాణ్యత కొరవడితే గ్రామస్తులు పర్యవేక్షణాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భోజన విరామం అనంతరం ప్రపంచ బ్యాంకు ద్వారా చేపడుతున్న పనులపై బృందం సభ్యులు చర్చించుకున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ డెప్యూటీ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎస్‌ఎస్ జైన్, ఎంబ్యాంక్‌మెంట్ వరల్డ్ ఎక్స్‌పర్ట్ ప్రాబ్లిట్ జోల్డర్, ఇంజనీర్ ఎక్స్‌పర్ట్ డీపీ మహాపాత్ర, ఎన్‌డీఎంఏ సెక్టర్ ఎక్స్‌పర్ట్ కెఎ. సింగ్ , అధికారులు పాల్గొన్నారు.