
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు అమలు చేసిన బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఇది రూ.5 వేల కోట్ల కుంభకోణమని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మొదటిదశ అర్బన్ హౌసింగ్ పథకం కింద 136 పట్టణాల్లో 4.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, 2014 నుంచి 2017 వరకు గృహనిర్మాణ పథకం గురించి ఆలోచించని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టులను నిర్ధారించారని తెలిపారు.
గృహ నిర్మాణాలకోసం ఒక్కో చదరపు అడుగు రేటును రూ.1,600గా నిర్ధారించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారని, వీటికోసం ఆరు కంపెనీలు పోటీపడ్డాయని, అవన్నీ రింగై ఆయా జిల్లాల్లో కాంట్రాక్టు పనుల్ని పంచుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు సహకరించడంతో వాటి పని సులభతరమైందన్నారు. నెల్లూరు జిల్లాలో నాగార్జున నిర్మాణ సంస్థ, కర్నూలు జిల్లాలో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ, వైఎస్సార్ జిల్లాలో నాగార్జున సంస్థ, అనంతపురం జిల్లా కాంట్రాక్టును షాపూర్‌జీ పల్లోంజీ, తిరుపతి కాంట్రాక్టును సింప్లెక్స్ కంపెనీ, విశాఖ జిల్లా కాంట్రాక్టును టాటా కంపెనీ, శ్రీకాకుళం జిల్లా కాంట్రాక్టును వీఎన్‌సీ అనే కంపెనీలు దక్కించుకున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రహదారి నిర్మాణ కాంట్రాక్టుల్లోనూ ఇవే ఆరు కంపెనీలు పోటీపడి తుదకు ఒక కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా రింగయ్యాయన్నారు.