సింధుకు రూ.3 కోట్లు

సింధుకు రూ.3 కోట్లు - Sakshi


- ఒలింపిక్ పతక విజేతకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నజరానా

- అమరావతిలో వెయ్యి గజాల స్థలం  

- కోరుకున్న శాఖలో గ్రూప్-1 పోస్టు

- పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదు

- నేనిచ్చిన సౌకర్యాలతోనే సింధూకు ఒలింపిక్స్‌లో పతకం

- అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడమే మా లక్ష్యం

- ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపు

- మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి

 

 సాక్షి, అమరావతి: పుల్లెల గోపీచంద్‌తో హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని తానే పెట్టించానని ముఖ్యమంత్రి చంద్రబాబు  చెప్పారు. గతంలో ఆ అకాడమీకితాను ఐదెకరాల స్థలం ఇవ్వకపోతే పీవీ సింధూకు రియో ఒలింపిక్స్‌లో పతకం వచ్చేదే కాదన్నారు. తానిచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని ఆమె ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిందని పేర్కొన్నారు. ఆమెకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 కోట్ల నగదు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, కోరుకున్న శాఖలో గ్రూపు-1 అధికారి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్‌లో సింధూకు శిక్షణ ఇచ్చి విజయానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాకు వివరించారు. హైదరాబాద్‌కి ఐఎంజీ వస్తే ఇప్పుడు ఒలింపిక్స్‌లో మనకు స్వర్ణం వచ్చేదని, గతంలో ఆ సంస్థను అడ్డుకున్నారని విమర్శించారు. అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడమే తన లక్ష్యమని తెలిపారు.  ఇంకా ఏం చెప్పారంటే...



► వెలగపూడిలో భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించాం. కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన జీఎస్‌టీ బిల్లు కోసం  సమావేశాలు నిర్వహిస్తున్నాం.

► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2015 జూలై ఒకటో తేదీ నుంచి 3.144 శాతం ఒక కిస్తు డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది జూలై వరకూ ఎరియర్స్‌ను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాం, ఆగస్టు నుంచి నగదు రూపంలో ఇస్తాం.ప్రభుత్వంపై నెలకు రూ.98.23 కోట్లు, సంవత్సరానికి రూ.1178.76 కోట్ల అదనపు భారం పడుతుంది.

► ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ సంవత్సరం వరకూ ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్‌సీ ఇస్తాం. భవిష్యత్తులో పీఆర్‌సీకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంబంధం ఉండదు. వారికి విడిగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తాం.

► ఐటీ విధానంలో రాయితీల నిర్వహణ ఇబ్బందికరంగా మారడంతో దాన్ని సవరించాలని నిర్ణయించాం. భూమితో కలిపి పెద్ద ప్రాజెక్టు చేపట్టిన ఐటీ కంపెనీకి ఒక్కొక్క ఉద్యోగానికి రూ.50 వేల చొప్పున రాయితీ, భూమి లేకుండా పెద్ద ప్రాజెక్టు చేపట్టిన ఐటీ కంపెనీకి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష చొప్పున రాయితీ ఇస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు నిర్వహించే కంపెనీలైతే ఒక్కో ఉద్యోగానికి రూ.1.50 లక్షల చొప్పున రాయితీ కల్పిస్తాం.

►కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే నిధులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నాం.

►రాజధానికి రూ.450 కోట్లు, లోటు బడ్జెట్ కింద కొంత మొత్తాన్ని కేంద్రం ఇచ్చింది. లోటు బడ్జెట్ మొత్తంపైనా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన డబ్బులకు యుటిలిటీ సర్టిఫికెట్లు త్వరలో ఇస్తాం.

 

 వెమ్ టెక్నాలజీస్‌కు 350 ఎకరాలు

 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు ప్రభు త్వ, ప్రైవేట్ సంస్థలకు భారీగా భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాలకు సంబం ధించి పలు పోస్టులు మంజూరు చేసింది.  మంత్రివర్గ సమావేశంలో చేసిన కేటాయింపులను చంద్రబాబు  వెల్లడించారు.  

 పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు, పెదవేగి మండలం భోగాపురం గ్రామాల్లో 350 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయింపు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వాహనాలు తయారు చేసే వెపన్స్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం ఈ భూముల వినియోగం. అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు కేటాయింపు. కృష్ణా-గోదావరి సంగ మం ప్రాంతం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి 25 ఎకరాలు కేటాయింపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top