వీరులను స్మరించుకుందాం

rk anand speech in companion of soldiers - Sakshi

దక్షిణ భారత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్‌కే ఆనంద్‌

ఉచిత వైద్య పరీక్షలు:మాజీ సైనికుల సమ్మేళనానికి హాజరైన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మెడికల్, సర్జికల్, ఈఎన్‌టీ నిపుణులు పాల్గొన్నారు. ఈసీజీ, ఎకో పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. తరగని సంపదను ఆర్జించిన వారైనా తుదకు వట్టి చేతులతో మట్టిలో కలవాల్సిందే. కీర్తిని ఆర్జించిన వారు ఆచంద్రతారార్కం గుండెల్లో గుడి కట్టుకుంటారు. భారతజాతి స్వేచ్ఛా వాయువుల కోసం నిరంతరం పరితపించి వీర మరణం పొందిన జవాన్లు అలాంటి వారే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మాజీ సైనికుల సమ్మేళనంలో అమరవీరుల ఆత్మీయుల కళ్లు కన్నీటి సుడులయ్యాయి. ఈ సందర్భంగా అందజేసిన బహుమతుల్లో తమ వారిని బలిగొన్న తూటాల శబ్దాలు వినిపించాయో ఏమో బావురుమని విలపించారు.

లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దక్షిణ భారత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్‌కే ఆనంద్‌ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాయుధ దళాల వీరుల గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి బంధువుల సమస్యలు తెలుసుకునేందుకు మహాసమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అర్కెలరీ సెంటర్‌ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, అమర జవానుల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆర్మీ బ్యాండ్‌ దేశభక్తిని పెంపొందించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ సబ్‌ ఏరియా మేజర్‌ జనరల్‌ ఎన్‌.శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. సైనిక్‌ వెల్ఫేర్‌ ఏపీ డైరెక్టర్, ఎంవీఎస్‌ కుమార్, విజయవాడ అదనపు పోలీస్‌ కమిషనర్‌ బీవీ రమణకుమార్‌ అతిథులుగా పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
వీరుల బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌ సమస్యలు, రుణాలు ఇతర అంశాలను పరిష్కరించేందుకు బ్యాంకు స్టాల్స్‌ ఏర్పాటుచేశారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్‌కే ఆనంద్‌ మాట్లాడుతూ మాజీ సైనికులు, యుద్ధ వితంతువులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలోని మాజీ సైనికులు, యుద్ధ వితంతువులను కలిసి సమస్యలు తెలుసుకుంటామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top