నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు! | Reward to Navayuga in interlinking of rivers | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!

Aug 3 2019 3:04 AM | Updated on Aug 3 2019 3:04 AM

Reward to Navayuga in interlinking of rivers - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి దశలో రెండో ప్యాకేజీ పనులు చేయకున్నా సరే నవయుగ–ఆర్వీఆర్‌ సంస్థకు రూ.26.55 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక కూడా రూ.351 కోట్లకుపైగా ఖజానాను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. చేయని పనులను చేసినట్లుగా చిత్రీకరించి కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.351,11,54,057 చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఖజానా నిండుకోవడంతో దీనికి బ్రేక్‌ పడింది. పెండింగ్‌ బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశం బహిర్గతమైంది. 

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ రూ.26.55 కోట్లు
ఎన్నికలకు ఆరు నెలల ముందు నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశ పనులను గత సర్కార్‌ చేపట్టింది. రెండు ప్యాకేజీల కింద టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 2వ ప్యాకేజీ (45 కి.మీ. నుంచి 66.600 కి.మీ. వరకు ఏడు వేల క్యూసెక్కులను ఎత్తిపోయడం) పనులను 4.41 శాతం ఎక్సెస్‌ ధరలకు అంటే రూ.2,655.49 కోట్లకు నవయుగ–ఆర్వీఆర్‌ దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్నాక సర్వే, ఇన్వెస్టిగేషన్‌ కోసం ఒక శాతం అంటే రూ.26.55 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద గుంటూరు జిల్లా ఎస్‌ఈ బాబూరావు చెల్లించారు. 

పెండింగ్‌ బిల్లులపై సమీక్షతో వెలుగులోకి..
నిబంధనల ప్రకారం సర్వే, ఇన్వెస్టిగేషన్‌ పనులు పూర్తయిన తర్వాత నాలుగు శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లించవచ్చు. అయితే సర్వే, ఇన్వెస్టిగేషన్‌ పనులే ఇంతవరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. లేబర్‌ కాంపొనెంట్‌ కింద నాలుగు శాతం (రూ.106,23,57,216), పనులు చేయకున్నా చేసినట్లు చూపిస్తూ మరో రూ.244,87,96,841 వెరసి మొత్తం రూ.351,11,54,057 మేరకు బిల్లులు చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ఉద్యోగులు నివ్వెరపోయారు. అసలు చేయని పనులకు బిల్లులు ఎలా చెల్లిస్తామంటూ నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన నాటి ప్రభుత్వ పెద్దలు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే ఖజానా ఖాళీ కావడంతో తెరచాటు యత్నాలు బెడిసికొట్టాయి.

పెండింగ్‌ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో కూడా తట్టెడు మట్టెత్తకుండానే నవయుగ సంస్థకు రూ.787.2 కోట్లు  ఇచ్చారని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనుల్లోనూ ఇదే రీతిలో నవయుగకు ఖజానా నుంచి ధారపోయటాన్ని బట్టి గత సర్కారు పెద్దలకు ఆ సంస్థతో ఎంత ధృఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement