breaking news
river interlinking
-
అందరి సమ్మతితోనే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా, ఏ రాష్ట్ర హక్కులకు విఘాతం కలగకుండా, పరివాహక ప్రాంతం (బేసిన్)లోని రాష్ట్రాల సమ్మతితో గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆరో సమావేశం జరిగింది. గోదావరి–కావేరి, బెడ్తి–వరద అనుసంధానంపై ఏకాభిప్రాయసాధనే అజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో బేసిన్‌లోని తొమ్మిది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక), కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి జలవనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ అనుసంధానంపై అతుల్ జైన్ తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలిస్తామని చెప్పారు. దీన్లో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని వివరిటంచారు. రెండోదశలో గంగా–మహానది, మహానది–గోదావరి అనుసంధానంతో కావేరికి మరిన్ని జలాలు తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్‌గఢ్ కోటా 148 టీఎంసీలను ఆ రాష్ట్రానికే ఇస్తామని చెప్పారు. రెండోదశ అనుసంధానంలో రాష్ట్రాల అవసరాల మేరకు నీటిని కేటాయిస్తామన్నారు. తొలిదశ అనుసంధానానికి అన్ని రాష్ట్రాలు సమ్మతి వ్యక్తం చేస్తే తక్షణమే ప్రాజెక్టును చేపడతామని ఆయన చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే.. ఆంధ్రప్రదేశ్: గోదావరిలో నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ మళ్లీ అధ్యయనం చేసి నికరజలాల్లో మిగులు తేల్చాలి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తే ఏపీ హక్కులకు భంగం వాటిల్లుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఏ రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లదు. నికర, వరదజలాల సమస్య ఉత్పన్నం కాదు. నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా వినియోగించుకుంటే వాటి ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. వరదల్లో కృష్ణా, పెన్నా నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, సోమశిల రిజర్వాయర్లపై సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలి. తెలంగాణ: ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపునకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనుసంధానంలో తరలించే జలాల్లో 50 శాతం నీటిని మాకు కేటాయించాలి. నాగార్జునసాగర్ ఆయకట్టుకు విఘాతం కలగకుండా చూడాలి. ఛత్తీస్‌గఢ్: ఇంద్రావతి సబ్‌బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మా కోటా 148 టీఎంసీలను తరలించడానికి అంగీకరించం. మహారాష్ట్ర: ఇచ్చంపల్లి బ్యారేజీలో నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మధ్యప్రదేశ్: గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విఘాతం కలగకుండా అనుసంధానించాలి. ఒడిశా: గోదావరి–కావేరి అనుసంధానం రెండోదశలో మహానది–గోదావరి అనుసంధానాన్ని అంగీకరించం. తమిళనాడు: మాకు నీటికేటాయింపు పెంచాలి. కర్ణాటక: కృష్ణాజలాల్లో మా వాటా పెంచాలి. కేరళ: కావేరి జలాల్లో మాకు అదనపు నీరు కేటాయించాలి. పుదుచ్చేరి: మాకు నీటికేటాయింపు పెంచాలి.నదుల అనుసంధానంలో ఏకాభిప్రాయమే ముఖ్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ముఖ్యమని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరింది. నదుల అనుసంధానంపై రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబులు ఇచి్చంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. 147.98 టీఎంసీల నీళ్ల బదిలీ కోసం ముసాయిదా డీపీఆర్‌ను ఇప్పటికే అన్ని పరీవాహక రాష్ట్రాలకు అందించినట్లు తెలిపింది. నదుల అనుసంధానం అమలు కోసం ముసాయిదా మెమొరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంవోఏ)ను తయారు చేసి.. గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొంది. అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కోసం ఐదుసార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన, ఎంవోఏపై సంతకాల కోసం కృషి చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా చేపట్టనున్న నదుల అనుసంధానం ప్రతిపాదనలను కూడా కేంద్రం ప్రస్తావించింది. మొత్తంగా 30 ప్రాజెక్టులకు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇందులో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్, గోదావరి–కావేరి లింక్ (గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి), పర్బతి–కలిసిం«ద్–చంబల్ నదుల అనుసంధానాన్ని తొలి ప్రాధాన్యతగా గుర్తించినట్లు పేర్కొంది. 2030 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. దీనిపై కమిటీ స్పందిస్తూ.. నీటి కొరత, కరువు నివారణ, వరద నియంత్రణకు ఆచరణీయమైన పరిష్కారాన్ని నదుల అనుసంధానం అందిస్తుందని అభిప్రాయపడింది. సంబంధిత రాష్ట్రాలకు దీనిపై అవగాహన పెంచి.. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించింది. -
మహానది టు కావేరి వయా గోదావరి!
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ద్వారా 477 టీఎంసీలను వినియోగించుకోవచ్చని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ కేంద్రానికి ప్రతిపాదించింది. మహానది నుంచి 230, గోదావరి నుంచి 247 టీఎంసీలను తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేయొచ్చంది. అనుసంధానంపై ఏకాభిప్రాయానికి ఆ నదుల పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర జల్ శక్తి శాఖ నిర్ణయించింది. మహానది – గోదావరి అనుసంధానం ఇలా.. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలిస్తారు. గోదావరి–కావేరి అనుసంధానం ఇలా.. జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఈ 247 టీఎంసీల గోదావరి జలాలకు మహానది నుంచి గోదావరిలోకి వచ్చిన 230 టీఎంసీలను జతచేసి.. మొత్తం 477 టీఎంసీలను మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానం ద్వారా తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. -
నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి దశలో రెండో ప్యాకేజీ పనులు చేయకున్నా సరే నవయుగ–ఆర్వీఆర్ సంస్థకు రూ.26.55 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా రూ.351 కోట్లకుపైగా ఖజానాను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. చేయని పనులను చేసినట్లుగా చిత్రీకరించి కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.351,11,54,057 చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఖజానా నిండుకోవడంతో దీనికి బ్రేక్ పడింది. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశం బహిర్గతమైంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.26.55 కోట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశ పనులను గత సర్కార్ చేపట్టింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 2వ ప్యాకేజీ (45 కి.మీ. నుంచి 66.600 కి.మీ. వరకు ఏడు వేల క్యూసెక్కులను ఎత్తిపోయడం) పనులను 4.41 శాతం ఎక్సెస్ ధరలకు అంటే రూ.2,655.49 కోట్లకు నవయుగ–ఆర్వీఆర్ దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్నాక సర్వే, ఇన్వెస్టిగేషన్ కోసం ఒక శాతం అంటే రూ.26.55 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద గుంటూరు జిల్లా ఎస్ఈ బాబూరావు చెల్లించారు. పెండింగ్ బిల్లులపై సమీక్షతో వెలుగులోకి.. నిబంధనల ప్రకారం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తయిన తర్వాత నాలుగు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించవచ్చు. అయితే సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులే ఇంతవరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు శాతం (రూ.106,23,57,216), పనులు చేయకున్నా చేసినట్లు చూపిస్తూ మరో రూ.244,87,96,841 వెరసి మొత్తం రూ.351,11,54,057 మేరకు బిల్లులు చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ఉద్యోగులు నివ్వెరపోయారు. అసలు చేయని పనులకు బిల్లులు ఎలా చెల్లిస్తామంటూ నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన నాటి ప్రభుత్వ పెద్దలు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే ఖజానా ఖాళీ కావడంతో తెరచాటు యత్నాలు బెడిసికొట్టాయి. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో కూడా తట్టెడు మట్టెత్తకుండానే నవయుగ సంస్థకు రూ.787.2 కోట్లు ఇచ్చారని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనుల్లోనూ ఇదే రీతిలో నవయుగకు ఖజానా నుంచి ధారపోయటాన్ని బట్టి గత సర్కారు పెద్దలకు ఆ సంస్థతో ఎంత ధృఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
నదుల అనుసంధానం జరిగేనా ?
-
నదుల అనుసంధానం కోసం రూ.కోటి
రజనీ సోదరుడు సత్యనారాయణ వెల్లడి సాక్షి, చెన్నై: ఇచ్చిన మాట ప్రకారం నదీ జలాల అనుసంధానం కోసం రజనీకాంత్ కోటి రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారని, ఆ పనులు మొదలవగానే డబ్బును అందజేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణ సోమవారం తంజావూరులో విలేకరుల సమక్షంలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నదీజలాల అనుసంధానం జరగాలన్న కోరిక పలువురి నుంచి వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం కోసం రూ.కోటి అందిస్తాననీ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. ఇదిలా ఉండ గా గత వారం తిరుచ్చిలో దక్షిణ భారత నదీజలాల అనుసంధాన వ్యవసాయ సంఘం రాష్ట్ర నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. అందులో రూ.కోటి ఇస్తానన్న రజనీకాంత్‌పై ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అందించాలని ఒత్తిడి చేయాలని తీర్మానం చేశారు. కాగా రజనీకాంత్ సోదరుడు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభకోణంలోని ఆలయాలను దర్శించారు. అనంతరం సోమవారం తంజావూరుకుకి చేరుకుని అక్కడ దేవాలయంలో శివపార్వతులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రజనీకాంత్ అమెరికాలో వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆయన నదీజలాల అనుసంధానం కోసం కోటి రూపాయలు ప్రకటించారన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనీ, పనులు ఎప్పుడు మొదలైతే అప్పుడు సంబంధిత నిర్వాహకులకు డబ్బును అందజేస్తారని తెలిపారు. రజనీ చెప్పింది చేస్తారనీ, అది ఆయన నైజమని సత్యనారాయణ పేర్కొన్నారు. -
నదుల అనుసంధానం పేరుతో మోసం
రామచంద్రపురం :గోదావరి, కృష్ణా నదులను ఆగస్టు 15 నాటికి అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని, పట్టిసీమ పేరుతో ఉభయ గోదావరి జిల్లాల రైతులను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15 నాటికి లీటరు నీటినైనా కృష్ణానదికి తరలించగలిగితే వారికి శాసనమండలిలో తమ పార్టీ తరఫున సన్మానం చేస్తామని ప్రకటించారు. రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో నదుల అనుసంధానం చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఇరిగేషన్ మంత్రి ప్రకటించటం హాస్యాస్పదమన్నారు. అసలు నిర్మాణం లేకుండా నే పట్టిసీమ ద్వారా నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్ని ంచారు. నదుల అనుసంధానానికి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. ఆయన హయాంలో నిర్మించిన తాటిపూడి పంపింగ్ స్కీం నుంచి పట్టిసీమ కుడి కాలువకు 14వ కిలోమీటరు వద్ద నీటిని మళ్లించి కృష్ణానదికి అనుసంధానం చేసేందుకు సీఎం, ఇరిగేషన్ మంత్రి యత్నించటం సిగ్గుచేటన్నారు. తాటిపూడి పంపింగ్ స్కీం వద్ద 8 పంపులు ఉండగా 5 పంపుల ద్వారా నీటిని పట్టిసీమ కుడికాలువ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నారన్నారు. పట్టిసీమ కుడికాలువ సుమారు 174 కిలోమీటర్లు కాగా దానిని వైఎస్ హయాంలోనే 135 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని, ఇంకా 45 కిలోమీటర్ల కాలువ పనులు చేయాల్సి ఉందని, పనులు కాకుండా తాటిపూడి పంపింగ్ స్కీము నుంచి నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ‘ఉభయ గోదావరి’ ఎడారే తాటిపూడి పంపింగ్ స్కీం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని, 8 పంపుల్లో 5 పంపుల ద్వారా నీటిని మళ్లిస్తే మిగిలిన మూడు పంపుల ద్వారా రైతులకు ఎంతమేర నీటిని అందించగలరని బోస్ ప్రశ్నించారు. పట్టిసీమ జీవోలో ఎక్కడా సాగునీటి ప్రస్తావన లేదని, కేవలం రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టా ప్రాంతాలను ఎడారి చేసేందుకే చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నడుంకట్టారని ఆరోపించారు. గోదావరికి వరద సమయంలో నీటిని పంపింగ్ చేస్తామని చెబుతూ పట్టిసీమ వద్ద గోదావరిలో 11 మీటర్ల వద్ద ఫుట్‌వాల్వు ఎందుకు బిగిస్తున్నారని, అదే సమయంలో కృష్ణా నదికీ వరదలు వస్తాయనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం చేస్తామంటున్న ఇరిగేషన్ మంత్రి గోదావరి జలాలను కృష్ణానదిలో ఎక్కడ నిల్వ ఉంచుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.