
నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ అతుల్ జైన్
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా, ఏ రాష్ట్ర హక్కులకు విఘాతం కలగకుండా, పరివాహక ప్రాంతం (బేసిన్)లోని రాష్ట్రాల సమ్మతితో గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆరో సమావేశం జరిగింది. గోదావరి–కావేరి, బెడ్తి–వరద అనుసంధానంపై ఏకాభిప్రాయసాధనే అజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో బేసిన్‌లోని తొమ్మిది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక), కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి జలవనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ అనుసంధానంపై అతుల్ జైన్ తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలిస్తామని చెప్పారు. దీన్లో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని వివరిటంచారు.
రెండోదశలో గంగా–మహానది, మహానది–గోదావరి అనుసంధానంతో కావేరికి మరిన్ని జలాలు తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్‌గఢ్ కోటా 148 టీఎంసీలను ఆ రాష్ట్రానికే ఇస్తామని చెప్పారు. రెండోదశ అనుసంధానంలో రాష్ట్రాల అవసరాల మేరకు నీటిని కేటాయిస్తామన్నారు. తొలిదశ అనుసంధానానికి అన్ని రాష్ట్రాలు సమ్మతి వ్యక్తం చేస్తే తక్షణమే ప్రాజెక్టును చేపడతామని ఆయన చెప్పారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే..
ఆంధ్రప్రదేశ్: గోదావరిలో నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ మళ్లీ అధ్యయనం చేసి నికరజలాల్లో మిగులు తేల్చాలి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తే ఏపీ హక్కులకు భంగం వాటిల్లుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఏ రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లదు.
నికర, వరదజలాల సమస్య ఉత్పన్నం కాదు. నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా వినియోగించుకుంటే వాటి ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. వరదల్లో కృష్ణా, పెన్నా నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, సోమశిల రిజర్వాయర్లపై సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలి.
తెలంగాణ: ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపునకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనుసంధానంలో తరలించే జలాల్లో 50 శాతం నీటిని మాకు కేటాయించాలి. నాగార్జునసాగర్ ఆయకట్టుకు విఘాతం కలగకుండా చూడాలి.
ఛత్తీస్‌గఢ్: ఇంద్రావతి సబ్‌బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మా కోటా 148 టీఎంసీలను తరలించడానికి అంగీకరించం.
మహారాష్ట్ర: ఇచ్చంపల్లి బ్యారేజీలో నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
మధ్యప్రదేశ్: గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విఘాతం కలగకుండా అనుసంధానించాలి.
ఒడిశా: గోదావరి–కావేరి అనుసంధానం రెండోదశలో మహానది–గోదావరి అనుసంధానాన్ని అంగీకరించం.
తమిళనాడు: మాకు నీటికేటాయింపు పెంచాలి.
కర్ణాటక: కృష్ణాజలాల్లో మా వాటా పెంచాలి.
కేరళ: కావేరి జలాల్లో మాకు అదనపు నీరు కేటాయించాలి.
పుదుచ్చేరి: మాకు నీటికేటాయింపు పెంచాలి.
నదుల అనుసంధానంలో ఏకాభిప్రాయమే ముఖ్యం
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ముఖ్యమని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరింది. నదుల అనుసంధానంపై రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబులు ఇచి్చంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. 147.98 టీఎంసీల నీళ్ల బదిలీ కోసం ముసాయిదా డీపీఆర్‌ను ఇప్పటికే అన్ని పరీవాహక రాష్ట్రాలకు అందించినట్లు తెలిపింది.
నదుల అనుసంధానం అమలు కోసం ముసాయిదా మెమొరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంవోఏ)ను తయారు చేసి.. గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొంది. అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కోసం ఐదుసార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన, ఎంవోఏపై సంతకాల కోసం కృషి చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా చేపట్టనున్న నదుల అనుసంధానం ప్రతిపాదనలను కూడా కేంద్రం ప్రస్తావించింది. మొత్తంగా 30 ప్రాజెక్టులకు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలిపింది.
ఇందులో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్, గోదావరి–కావేరి లింక్ (గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి), పర్బతి–
కలిసిం«ద్–చంబల్ నదుల అనుసంధానాన్ని తొలి ప్రాధాన్యతగా గుర్తించినట్లు పేర్కొంది. 2030 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. దీనిపై కమిటీ స్పందిస్తూ.. నీటి కొరత, కరువు నివారణ, వరద నియంత్రణకు ఆచరణీయమైన పరిష్కారాన్ని నదుల అనుసంధానం అందిస్తుందని అభిప్రాయపడింది. సంబంధిత రాష్ట్రాలకు దీనిపై అవగాహన పెంచి.. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించింది.