భూలోకం | revenue department and tdp leaders land grabbing in chittoor | Sakshi
Sakshi News home page

భూలోకం

Nov 20 2017 11:26 AM | Updated on Aug 10 2018 9:42 PM

జిల్లాలో ఈ రెండు ఉదాహరణలే కాదు. ఒక్కో మండలంలో ఒక్కో భూబాగోతం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడిన కొందరు రెవెన్యూ అధికారులను మంచి చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే..పాగా వేసేస్తున్నారు. అందిన కాడికి అడ్డంగా ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా రెవెన్యూ యంత్రాం గం మొద్దునిద్ర వీడకపోవడం గమనార్హం.

ఆ భూమితో మాకు సంబంధంలేదు
నా భార్య రేణుక పేరుతో నాలుగు ఎకరాలు, నా పేరుతో 2.3 ఎకరాలు ఉన్నమాట వాస్తవం. ఈ భూములు చాలా ఏళ్ల నుంచి నా ఆదీనంలో లేవు. మా ఊరి ప్రజలే వాటిని అనుభవిస్తున్నా రు. కావాలంటే ఈ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తాను. ఎఫ్‌ఎంబీ, 1–బీ, మీ భూమి పట్టాల్లో భూమి విస్తీర్ణం ఒక్కో రకంగా ఉందన్న విషయం నాకు తెలియదు.
– లోక్‌నాథ్‌నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్‌ఆర్‌పురం

చిత్తూరు, సాక్షి: జిల్లాలో భూకబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలాలు కన్పిస్తే అధికార పార్టీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. అడ్డదిడ్డంగా ఆక్రమించి పట్టాలు సృష్టించుకుంటున్నారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం.

దాసోహమయ్యారా?
శ్రీరంగరాజపురం మండలంలోని కొందరు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు దాసోహమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. మండల పరిధిలోని 56 కన్నికాపురంలో టీడీపీ నాయకుడు లోక్‌నాథ్‌నాయుడు భార్య రేణుక పేరుమీద సర్వే నం.136/3బీ, 136/3ఏ, 135/11లో 4.4 ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఈ భూమిని కూడా ఎఫ్‌ఎంబీ (ఫీల్డ్‌మెజర్‌మెంట్‌ బుక్‌)లో 10.45 ఎకరాలు, 1బీలో4.4 ఎకరాలు, ఆన్‌లైన్‌లో 14.4 ఎకరాలుగా నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైనా సంబంధిత అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు.

పప్పూ..బెల్లంలా..
డీకేటీ భూముల పంపకంపై 2009లో ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలో మాత్రం కావాల్సిన వారికి పప్పూబెల్లంలా రెవెన్యూ అధికారులు పంచేస్తున్నారు. లోకనాథ్‌నాయుడుకి కొన్ని నెలల క్రితమే సర్వే నెంబర్‌ 135/7లో 2.17 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ఆ ప్రాంతంలో ఎకరా సుమారు రూ.25 లక్షల పైమాటే.

సీజేఎఫ్‌ భూములూ కబ్జా..
టీడీపీ నాయకుడు లోకనాథ్‌నాయుడు భార్యకు కట్టబెట్టిన భూముల పక్కనే అటవీ భూములున్నాయి. ఈ భూములకు ఆనుకుని కేంద్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ ప్రాజెక్టు చేపడుతోంది. ఆ ప్రాంతంలో భూముల ధరలు రెక్కలొచ్చాయి. టీడీపీ నాయకుడి కన్ను అటవీ భూములపై పడింది. ఎంచక్కా ఆక్రమించి కంచె నాటడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామిడి చెట్లు పెంచడానికి గుంతల తవ్వకాన్ని పూర్తిచేశాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

నజరానా ఇందుకేనా?
ఎస్సార్‌పురం మండల కేంద్రంలో టీడీపీకి రూ.30 లక్షల వ్యయంతో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇచ్చారు లోక్‌నాథ్‌నాయుడు. దీనికి ప్రతిగానే డీకేటీ భూములు కేటాయిం చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజేఎఫ్‌ భూములు ఆక్రమించుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కార ణం కూడా పార్టీకి భవనాన్ని నిర్మించి ఇవ్వడమేనని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని, మండల టీడీపీ అధ్యక్షుడు రుద్రప్పనాయుడు చొరవతోనే లోకనాథ్‌నాయుడు కబ్జాలకు ఒడిగడుతున్నట్లు ఆ పార్టీ నాయకులే బాహాటకంగా చెబు తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement