‘గణతంత్ర’ ఏర్పాట్లు పూర్తి చేయండి | 'Republic' Make arrangements | Sakshi
Sakshi News home page

‘గణతంత్ర’ ఏర్పాట్లు పూర్తి చేయండి

Jan 9 2014 4:24 AM | Updated on Sep 2 2017 2:24 AM

జిల్లా ఖ్యాతిని ప్రతిబింబించేలా గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు.

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా ఖ్యాతిని ప్రతిబింబించేలా గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర  వేడుకల ఏర్పాట్లపై బుధవారం టీటీడీసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ సహకారంతో ఖమ్మం ఆర్డీవో, అర్బన్ తహశీల్దార్ సమన్వయంతో పరేడ్ ఏర్పాట్లకు సిద్ధం చేయాలన్నారు. డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్సీ కార్పొరేషన్, డీఎమ్‌హెచ్‌వో, వ్యవసాయశాఖ, డ్వామా, హౌసింగ్, ఐసీడీఎస్, ఆర్వీఎం పీవో, ఉద్యానవన శాఖలతో పాటు ప్రత్యేకంగా ఓటరు నమోదు కార్యక్రమం గురించి అవగాహన కల్పించే శకటాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఏజెన్సీ ప్రాంతంలో సేవలు అందిస్తున్న వైద్యులకు మెరిట్ సర్టిఫికెట్లు అందించేందుకు 20వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యం కల్పించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో శివ శ్రీనివాస్, జడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ, డీఎస్పీ బాలకిషన్‌రావు, ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించాలి
 జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ వైద్యారోగ్య శాఖాధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 19న పూర్తిస్థాయి పల్స్‌పోలియో కార్యక్రమం, 20, 21 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ఏజన్సీ, గిరిజన ఆవాసాల్లో, వారాంతపు సంతల్లో మొబైల్ సంచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లా అయినందున వలసలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 2,98,228 మంది ఉన్నారని, అందరికీ పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. సమావేశంలో డీఐఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
 24న జిల్లా ఆవిర్భావ దినోత్సవాలు...
 ఈనెల 24న జిల్లా 60వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో 60 వసంతాల వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాకు సంబంధించి 60 సంవత్సరాల అరుదైన ఛాయాచిత్రాలు ఉంటే అందించాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement