 
													గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఏటా భారీ పరేడ్
నవంబర్ 1 నుంచి 15 వరకు
భారత్ పర్వ్–2025: అమిత్ షా
పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో భారీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్ వల్లబ్‌భాయి పటేల్ 150 జయంతి (అక్టోబర్ 31)ని పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి భారత్ పర్వ్–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్ ఏటా అక్టోబర్ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్ సర్దార్ పటేల్ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్‌లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్‌ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు.  
15 రోజులు భారత్ పర్వ్ 
సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ పర్వ్–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్ 15 వరకు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
