
ఖమ్మం జిల్లా: మండలంలోని వీవీ.పాలెంనకు చెందిన ఓ వివాహిత రౌడీషిటర్ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన బోడా సుశీల (28).. మరో మహిళతో కలిసి సోమవారం కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని పత్తి చేనులో పనికి వెళ్లింది. గ్రామానికే చెందిన రౌడీషీటర్ వినయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ఎదురుతిరగడంతో దాడి చేసినట్లు తెలిసింది.
దీంతో ఆమె ఇంటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. సుశీలకు భర్త, ఓ కుమారుడు ఉన్నారు. రౌడీ షీటర్ వినయ్ తరచూ వేధిస్తుండడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, సదరు రౌడీషిటర్ వినయ్ కారులో సుశీలను బలవంతంగా తీసుకెళ్లి అమ్మపాలంలో వదిలేశాడని, ఈ విషయంలో అనుమానాలు ఉన్నా యని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అంతేకాక మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నా పట్టించుకోకుండా.. ఉరివేసుకుని, సహజ మరణంగా వైద్యులు తేల్చారంటూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుశీల భర్త, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో సీఐ ఉస్మాన్‌షరీఫ్, ఎస్‌ఐలు వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈక్రమాన కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.