ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 

Replacement of government jobs annually - Sakshi

డీఎస్సీ–2018 కేసులు పరిష్కారమయ్యాక కొత్త డీఎస్సీ 

ఈలోగా 7 వేల మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం: మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్‌ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా అన్ని శాఖల్లో ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపడుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ నియామకాలపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. టీచర్ల పోస్టుల భర్తీకి ఖాళీలు గుర్తించి డీఎస్సీ నిర్వహణకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందన్నారు. డీఎస్సీ–2018కి సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు కూడా ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

ఈలోపు పాఠశాలల్లో విద్యాబోధనకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు 7 వేల మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తామన్నారు. మూడు నెలలకు రూ. 12 కోట్ల వ్యయంతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించిన ఫైలును సీఎం పరిశీలన కోసం పంపించామన్నారు. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తిలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు.

తెలుగు భాష గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 16 ఏళ్లుగా పెండింగులో ఉన్న భాషా పండిట్ల పదోన్నతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతులు ఇచ్చారని చెప్పారు. మరోపక్క 12 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామన్నారు. గ్రేడ్‌–2 హెచ్‌ఎంలకు కూడా పదోన్నతులు కల్పించినట్టు మంత్రి తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టులు 15 వేలు ఉంటే వాటిని అప్‌గ్రేడ్‌ చేసి  ఇప్పటికే 6,500 మందికి పదోన్నతులు ఇచ్చామని వివరించారు.  

ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం: ఎమ్మెల్యే ఆర్కే 
ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సీఎం వైఎస్‌ జగన్‌కి ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top