ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ! | Renuka denies defecting to TDP | Sakshi
Sakshi News home page

ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ!

May 28 2014 2:06 AM | Updated on May 25 2018 9:17 PM

ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ! - Sakshi

ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ!

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ ఆ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర కమిటీ సభ్యుడు ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డితో పాటు కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం తేల్చి చెప్పారు.

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఆ పార్టీ నేతలు సాగిస్తున్న మైండ్‌గేమ్‌కు తెరపడింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ ఆ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర కమిటీ సభ్యుడు ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డితో పాటు కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం తేల్చి చెప్పారు. వీరి ప్రకటనలో తమ్ముళ్ల నోళ్లకు తాళం పడినట్లయింది. జిల్లాలో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు కొందరు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరతీశారు. అందులో భాగంగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వారి మాయలో పడ్డారు. ఆ పార్టీ ప్రలోభాలకు తలొగ్గి పచ్చకండువా కప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

 ప్రజా తీర్పును అగౌరవపరిచారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం పార్టీ మారాలంటూ గందరగోళానికి గురిచేశారు. రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె కూడా తడబడ్డారు. తప్పు చేసినట్లు తెలుసుకునే లోపు టీడీపీలో చేరిపోయినట్లు ప్రచారం జరిగిపోయింది. ఇదంతా కుట్రపూరితమేనని బుట్టా రేణుక ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాకు శుభం కార్డు వేశారు. రాజకీయ ఎదుగుదలకు అవకాశం కల్పించిన వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతానని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ.. కర్నూలు పార్లమెంట్ పరిధిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.

 తప్పుడు ప్రచారం మానుకోవాలి: తనపై టీడీపీ శ్రేణులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారెళ్లారు.. వీరెళ్తున్నారంటూ తమ్ముళ్లు సాగిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కర్నూలు, గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తామంతా వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతామంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు సైతం ఆయా ప్రాంతాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడబోమంటూ ప్రకటించారు. టీడీపీ నేతల అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాలో అపరిష్కృత సమస్యలపై పోరుకు అధికార టీడీపీ నేతలు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. మైండ్‌గేమ్‌ను పక్కనపెట్టి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement