పునరావాస కాలనీ ఆదర్శంగా ఉండాలి | Rehabilitation colony should be a role model | Sakshi
Sakshi News home page

పునరావాస కాలనీ ఆదర్శంగా ఉండాలి

Sep 15 2013 4:01 AM | Updated on Aug 29 2018 4:16 PM

పులిచింతల పునరావాసులకు నిర్మిస్తున్న కాలనీలు దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : పులిచింతల పునరావాసులకు నిర్మిస్తున్న కాలనీలు దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక లక్ష్మీనర్సింహగార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో పులిచింతల బాధితుల సమస్యలపై అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పులిచింతల ముంపుబాధితుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతుల ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
 
 దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు పరిధిలోని ముంపు బాధితులకు కూడా అందని పరిహారా న్ని పులిచింతల బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ బాధితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు  తెలిపారు. గృహనిర్మాణాలకు గాను ఎస్సీ, ఎస్టీలకు లక్షా 18వేలు, ఓసీ, బీసీలకు రూ. 98వేల చొప్పున అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పరిధిలో భూసేకరణకు రూ.164 కోట్లు, ముంపు బాధితులకు రూ. 43 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. రూ. 147 కోట్ల వ్యయంతో లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టి మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల భూములకు పులిచింతల ప్రాజెక్టు నుంచి 1.6 టీఎంసీల నీటిని అందజేయనున్నట్లు తెలిపారు. మరో 6 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు మరో లిఫ్ట్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రతి 15, 20 రోజులకు ఒక సారి పులిచింతల బాధితులతో సమావేశం నిర్వహించి నష్టపరిహార చెక్కులను అందజేస్తున్నట్లు  తెలిపారు.
 
 అనంతరం నేరేడుచర్ల మండలం గుండెబోయినగూడెం ముంపు బాధితులకు రూ.75లక్షలు, సుల్తాన్‌పూర్‌తండా ముంపుబాధితులకు రూ.91 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్, హౌ సింగ్ పీడీ శరత్‌బాబు, మిర్యాలగూడ, సూర్యాపేట ఆర్డీఓలు శ్రీనివాసరెడ్డి, నాగన్న, ఏపీఎస్‌ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, ఎన్‌డీసీఎంఎస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, పులిచింతల అధికారులు, వివిధ శాఖల డీఈలు, ఏఈలు, ముంపు బాధితులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement