అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల | Redwood conserving vegetation | Sakshi
Sakshi News home page

అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల

Apr 9 2015 2:44 AM | Updated on Sep 3 2017 12:02 AM

అంతం కాదు..  ఆరంభమే: బొజ్జల

అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల

ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్

హైదరాబాద్: ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ ఆరంభం మాత్రమేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోకి సోమవారం భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ చేపట్టిందన్నారు. కూంబింగ్ చేస్తోన్న బలగాలపై ఎర్రచందనం స్మగ్లర్లు విచక్షణారహితంగా దాడులు చేశారని.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని వివరించారు.

ఆ కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది స్మగ్లర్లు కాదు తమిళనాడుకు చెందిన కూలీలే కదా అన్న ప్రశ్నకు బొజ్జల స్పందిస్తూ.. కూలీలకు అర్ధరాత్రి అడవిలో ఏం పనంటూ ఎదురుదాడికి దిగారు. కూలీలైతే అర్ధరాత్రి అడవిలో గడ్డికోసుకోవడానికి వెళ్లారా అంటూ ఎద్దేవా చేశారు. గతంలో పోలీసులు అరెస్టు చేసిన కూలీలనే ఎన్‌కౌంటర్‌లో చంపేశారన్న విమర్శలు వ్యక్తమవుతోండటాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా, రాజకీయ అండదండలున్నా వదిలి పెట్టబోమన్నారు. రాజకీయ నాయకులకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు దొరికితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement