రాయపాటి మెడకు ఈడీ ఉచ్చు! | Sakshi
Sakshi News home page

రాయపాటి మెడకు ఈడీ ఉచ్చు!

Published Sat, Jan 4 2020 5:18 AM

Rayapati Sambasiva Rao Huge Illegal fund diversion - Sakshi

సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్‌: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రమోటర్, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌ 18 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.8,836.45 కోట్ల రుణంలో రూ.3,822 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడంపై ఈడీ శుక్రవారం కేసు నమోదు చేసింది. సంస్థ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్‌  సూర్యదేవర శ్రీనివాసబాబ్జీలపై కూడా కేసులు నమోదు చేసింది. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం)కు విరుద్ధంగా సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేíసియాలకు రాయపాటి అక్రమంగా భారీగా నిధులు మళ్లించడంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ట్రాన్స్‌ట్రాయ్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం తీసుకుని ఎగ్గొట్టడంపై యూనియన్‌ బ్యాంకు ఫిర్యాదు మేరకు డిసెంబర్‌ 30న రాయపాటి తదితరులపై సీబీఐ కేసులు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ సమాంతరంగా విచారణ చేపట్టాయి. 

రికార్డులు ఇవ్వకుండా ఎస్‌ఈపై ఒత్తిడి?
పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ చేస్తున్న సమయంలో 2017 మార్చి 31 నుంచి డిసెంబర్‌ 31 మధ్య తాము ఆడిటింగ్‌ నిర్వహించగా ఎస్‌ఈ రికార్డులివ్వకుండా సహాయ నిరాకరణ చేశారంటూ యూనియన్‌ బ్యాంకు రీజనల్‌ హెడ్‌ ఎస్కే భార్గవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు, రాయపాటికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. రికార్డులివ్వకుండా ఎస్‌ఈని నాటి ప్రభుత్వమే ప్రభావితం చేసిందని సీబీఐ నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్‌ ద్వారా కాకుండా ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా రూ.2,267.22 కోట్ల బిల్లులు చెల్లించడం, సింహభాగాన్ని సింగపూర్, రష్యా, మలేíసియాకు మళ్లించడంలో లోగుట్టుపై పరిశోధిస్తున్నాయి.

దొడ్డిదారిన బిల్లుల చెల్లింపు!: ట్రాన్స్‌ట్రాయ్‌ రుణాలను తిరిగి చెల్లించడం లేదని ఈ నేపథ్యంలో పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో తమ బకాయిల వసూలుకు సహకరించాలంటూ 2015 జూలై 31న అప్పటి సీఎం చంద్రబాబును జాతీయ బ్యాంకుల కన్సార్షియం కోరింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అప్పులు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాక గత సర్కారు ఇతర బ్యాంకుల ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి దొడ్డిదారిన బిల్లులివ్వడంపై సీబీఐ దృష్టి సారించింది. ‘ఎస్క్రో’ అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు టీడీపీ సర్కార్‌ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణమిచ్చామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. 

విభేదాలతో వెలుగులోకి?: కేసులో సీబీఐ దర్యాప్తు  వేగంగా జరగడానికి, స్వల్పకాలంలో కీలక ఆధారాలు లభించడానికి రాయపాటి కుటుంబంతో చెరుకూరి శ్రీధర్‌కి తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. తన తండ్రికి తెలియకుండా శ్రీధర్‌ అక్రమాలకు పాల్పడినట్లు రాయపాటి రంగారావు ఇటీవల సీబీఐ, ఈడీ, ప్రధానికి కొన్ని ఆధారాలతో లేఖలు రాసినట్లు సమాచారం.  

సింగపూర్‌కు తరలిన నిధులు..?
సింగపూర్‌లోని ట్రాన్స్‌ట్రాయ్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.15.34 కోట్లను మళ్లించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇందులో డైరెక్టర్లు ఎవరు? వారికి రాయపాటితో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశంపై సీబీఐ, ఈడీ వేర్వేరుగా విచారణ చేస్తున్నాయి. టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు ఈ సంస్థల డైరెక్టర్లుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. శ్రీజయలక్ష్మి పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు రూ.36.50 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ మళ్లించడంపైనా ఈడీ కూపీ లాగుతోంది.

Advertisement
Advertisement