నా భర్తకు ప్రాణహాని | Rajeswari Police Complaint On Husband Life Threats Kurnool | Sakshi
Sakshi News home page

నా భర్తకు ప్రాణహాని

Oct 23 2018 2:06 PM | Updated on Oct 23 2018 2:06 PM

Rajeswari Police Complaint On Husband Life Threats Kurnool - Sakshi

ఎస్పీకి విన్నవిస్తున్న మల్లెపల్లె అనంతరెడ్డి సతీమణి రాజేశ్వరి..చిత్రంలో వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ సమన్వయకర్త శ్రీదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి

కర్నూలు:  తన భర్త అనంతరెడ్డికి అధికార పార్టీకి చెందిన వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం మల్లెపల్లెకు చెందిన అనంతరెడ్డి సతీమణి రాజేశ్వరి ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డితో కలసి  ప్రజాదర్బార్‌లో ఎస్పీని కలసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తమ కుటుంబానికి శత్రువులెవరూ లేరని, అలాంటప్పుడు బాంబులు దాచుకోవాల్సిన అవసరం ఏముంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ నేతలు తన భర్తను టార్గెట్‌ చేసి.. బాంబుల కేసులో ఇరికించారని ఆమె ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు తన భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నారని, ఈ విషయంలో స్థానిక పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆమె కోరారు.

కుటుంబ సభ్యులమంతా కలసి ఈ నెల 19న అవుకు మండలం చెన్నంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లామని, గ్రామంలో లేనిసమయంలో అధికార పార్టీ నాయకులు తమ కల్లందొడ్డిలో బాంబులు పెట్టించి పోలీసులకు సమాచారమిచ్చి అక్రమంగా కేసులో ఇరికించారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బోయ కుక్కల అయ్యస్వామి తమ కల్లందొడ్డి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు అనుమానాస్పదంగా సంచరించాడని, ఆ తర్వాతే పోలీసులు కల్లందొడ్డిలోని గడ్డివాములో బాంబులు దొరికాయంటూ తన భర్తపై కేసు నమోదు చేశారని వివరించారు. మల్లెపల్లె మాజీ సర్పంచ్‌ బోయ జయరాముడుకు, బోయ అయ్యస్వామికి పొలం తగాదాలు ఉండేవని,  జయరాముడు తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేక అతనే గడ్డివాములో బాంబులు పెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

టీడీపీవి కుట్ర రాజకీయాలు  : బి.వై.రామయ్య  
టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య విమర్శించారు. ఎస్పీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలకు రక్షణ కరువైందన్నారు.  గడ్డివాములు, కల్లెందొడ్లకు కూడా కాపలా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఈ ప్రభుత్వ హయాంలో ఏర్పడిందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, లేదంటే మట్టుబెట్టడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా మారిందన్నారు. మల్లెపల్లె అనంతరెడ్డిపై కేసులు నమోదు చేయడం కుట్రలో భాగమేనన్నారు.  

టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది : కంగాటి శ్రీదేవి  
పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనలేక అధికార టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి విమర్శించారు. గతంలో తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక హత్య చేశారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రపూరితంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. అక్రమ కేసులు బనాయించి పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్పీని కలసిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్‌ సురేందర్‌రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దయ్య, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రహిమాన్, దేవపూజ ధనుంజయ ఆచారి తదితరులు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement