రసాయనిక ఆహారంతోనే 75% జీవనశైలి జబ్బులు

Rajendra Singh comments on AP govt - Sakshi - Sakshi

అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ వందనాశివ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయం వల్ల రసాయనిక అవశేషాలు, పోషకాల లోపంతో కూడిన ఆహారోత్పత్తి జరుగుతోందని ప్రముఖ శాస్త్రవేత్త, దేశీ విత్తన పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్‌ వందనాశివ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆహారం తినడం వల్లే జీవనశైలి వ్యాధులు మానవాళికి పెనుముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్‌) సదస్సులో వందనాశివ ప్రారంభోపన్యాసం చేశారు. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తున్న పంటల వల్ల ప్రకృతి వనరులు 70% ఖర్చవుతూ కేవలం 30% ఆహారోత్పత్తి అవుతోందని వందన తెలిపారు. ప్రజలు కేన్సర్, షుగర్, గుండెజబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల బారినపడటానికి 75% రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణమన్నారు. మరోవైపు చిన్న, సన్నకారు రైతులు కేవలం 30% వనరులను ఉపయోగిస్తూ 70% ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారన్నారు.

రసాయనిక వ్యవసాయం, బీటీ పత్తి వంటి జన్యుమార్పిడి పంటల వల్ల రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పారు. రసాయనిక వ్యవసాయం కొనసాగితే మరో వందేళ్లలో తిండి కూడా దొరకదన్నారు. బహుళజాతి కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే సాంకేతికతలను అభివృద్ధి పేరుతో రైతులపై రుద్దుతున్న బిల్‌గేట్స్‌ వంటి వ్యక్తులు పర్యావరణ అజ్ఞానులని ఆమె విమర్శించారు. అటువంటి వారి అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులుండటం దురదృష్టకరమని పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకృతి/శాశ్వత వ్యవసాయ పద్ధతుల వల్లే సాగు సంక్షోభం శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.

ఏపీ సర్కారువి వికృత పోకడలు: రాజేంద్రసింగ్‌ 
నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం, సారవంతమైన వ్యవసాయ భూములను రైతుల నుంచి లాక్కోవడం వంటి వికృత పోకడలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయంగా మారిందని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, జలయోధుడు రాజేంద్రసింగ్‌ విమర్శించారు. పాలకులు, ప్రజలు జల చైతన్యంతో వ్యవహరించినప్పుడే నీటి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఎండిపోయిన నదులను దశాబ్దాల తర్వాత పునరుజ్జీవింపజేయడం సాధ్యమేనని తాము రాజస్తాన్‌లో రుజువు చేశామన్నారు. పర్మాకల్చర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు విఠల్‌ రాజన్‌ ప్రసంగిస్తూ జీవ వైవిధ్యానికి పెద్దపీట వేసే వ్యవసాయ సంస్కృతికి భారత్‌ పెట్టింది పేరన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పర్మాకల్చర్‌ ఉద్యమ నేత రోజ్‌మేరో, భారతీయ సేంద్రియ వ్యవసాయదారుల సంఘం నేతలు డా. క్లాడ్‌ అల్వారిస్, డా. సుల్తాన్‌ ఇస్మాయిల్, అర్ధేందు చటర్జీ, ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్‌ తదితరులు ప్రసంగించారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ వ్యవస్థాపకులు కొప్పుల నరసన్న అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు 65 దేశాల నుంచి సుమారు 800 మంది ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది రైతులు హాజరయ్యారు. సదస్సులో పాల్గొనే తెలుగు రైతుల కోసం ప్రత్యేక అనువాద సదుపాయం కల్పించడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top