ఏపీలో వాన బీభత్సం.. | Sakshi
Sakshi News home page

ఏపీలో వాన బీభత్సం..

Published Fri, Sep 23 2016 4:12 AM

ఏపీలో వాన బీభత్సం.. - Sakshi

పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఏడుగురి మృతి
 
 సాక్షి నెట్‌వర్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. చెరువులు, కాలువలు నిండుకుండల్లా తయారయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెరువులు తెగి గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. భారీ పంట నష్టం జరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీలో రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. రోడ్డు, రైలు మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. వర్షబీభత్సానికి హైవేలపై భారీగా వరద నీరు చేరింది.

హైదరాబాద్-గుంటూరు మార్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి, రాజమండ్రి-విశాఖ హైవేలపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తూర్పుగోదావరి, విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రోడ్లు దెబ్బతిని, రాకపోకలు బంద్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచే వరద నీరు రోడ్లపైకి చేరడంతో అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  గుంటూరు జిల్లా నకరేకల్లు మండలంలో అత్యధికంగా 24.14 సెం.మీ. వర్షం కురిసింది. పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు వరదల బారిన పడిన బాధితుల్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement
Advertisement