
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ప్రేమ పేరుతో యువతిని మోసగించిన రైల్వే ఉద్యోగిని ఇనగుదురుపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సీఐ ఎస్‌కే నభీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంటుమిల్లికి చెందిన జోగి హరికృష్ణ విజయవాడ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. మచిలీపట్నంలో మరదలు వరస అయిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలతో లొంగ దీసుకున్నాడు. శారీరకంగా అనేకమార్లు ఆమెను కలిశాడు. పెళ్ళి విషయానికి వచ్చేసరికి కట్నం కోసం అడ్డం తిరిగాడు. పది లక్షలకుపైగా కట్నం ఇస్తే తప్ప పెళ్ళి చేసుకోనని చెప్పాడు. యువతి తల్లితండ్రులు ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో పెట్టి చర్చలు జరిపారు. అయినా హరికృష్ణ ఒప్పుకోలేదు. గత్యంతరం లేని బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హరికృష్ణను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హరికృష్ణతో పాటు అతని తల్లితండ్రులను కూడా కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నభీ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై కుమార్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.