వైఎస్‌ జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు : ఆర్‌.కృష్ణయ్య

R Krishnaiah Comments After Meeting With YS Jagan - Sakshi

బీసీ సంక్షేమాన్ని చేతల్లో చూపిస్తామన్నారు

సాక్షి, హైదరాబాద్‌ (సిటీబ్యూరో): బీసీల సంక్షేమం కోసం మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపిస్తామని, బీసీల కోసం ఎంతకైనా తెగించి పోరాడతానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనపై రాజ్యసభలో ఒత్తిడి తేవాలని కృష్ణయ్య తన బృందంతో కలిసి శనివారం జగన్‌ను ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాజ్యసభలో ఒత్తిడి పెంచాలని, అలాగే తమ 15 డిమాండ్లను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని జగన్‌ను కోరామని తెలిపారు. 

బీసీ యాక్ట్‌ తీసుకురావాలి: ‘చట్టసభల్లో 50 శాతం, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలి. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రాష్ట్రంలో 25 శాతం నుంచి 50కి, కేంద్రంలో 27 నుంచి 50 శాతం పెంచాలి. బీసీలకు రాజ్యంగబద్ధ హక్కులు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మాదిరిగా బీసీ యాక్ట్‌ తీసుకురావాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రేందంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి’ అని కోరుతున్నట్లు కృష్ణయ్య చెప్పారు. 

బీసీల సంక్షేమానికి జగన్‌ స్పష్టమైన హామీనిచ్చారు: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో జనాభా ప్రకారం కోటా కల్పించాలని, రాష్ట్రానికి సంబంధించి డిమాండ్లను బీసీల ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని జగన్‌ను కోరామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్‌ సీపీ మాత్రమే ప్రైవేట్‌ బిల్లు పెట్టిందని, అందుకు వైఎస్‌ జగన్‌ను అభినందించామని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని మోదీ బీసీలకు ఏమి చేయలేకపోయారన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై వైఎస్సార్‌ సీపీ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరామని, అందుకు వైఎస్‌ జగన్‌ బాగా స్పందించారని కృష్ణయ్య వెల్లడించారు. బిల్లు పెట్టడమే కాదు... ఆమోదం పొందే వరకు ఒత్తిడి తేస్తామని, చివరి 3 రోజుల్లో కూడా రాజ్యసభలో లేవనెత్తుతామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి దారిలో బీసీల పక్షాన నిలబడాలని కోరగా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. బీసీల కోసం తెగించి పోరాడుతామని, మాటలు కాదు.. ఆచరణలో చేసి చూపిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. వైఎస్సార్‌ సీపీ బీసీ గర్జన గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చట్టసభల్లో రిజర్వేషన్లు ఎవరు పెడతామన్న వారి సభలకు పోవటానికి తాము సిద్ధమని కృష్ణయ్య సమాధానమిచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top