ఎపి ఎన్జీఓలు ఎల్బి స్టేడియంలో నిర్వహించే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులను తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించడంలేదు.
హైదరాబాద్: ఎపి ఎన్జీఓలు ఎల్బి స్టేడియంలో నిర్వహించే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులను తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించడంలేదు. కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన కళాకారులను కూడా స్టేడియం లోపలకు అనుమతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు నగరంలోని ప్రవేట్ ఉద్యోగులు ముఖ్యంగా సాప్ట్వేర్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు వారిని స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో వారు బయటే నిలబడి నిరసన తెలుపుతున్నారు. వేల మంది జనం స్టేడియం బయట మానవహారంగా ఏర్పడి నినాదాలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. స్టేడియం లోపల, బయట సమైక్యాంధ్ర నినాదాల హోరు కొనసాగుతోంది.
బహిరంగ సభలో పాటలు పాడేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్లను కూడా తొలుత లోపలకు అనుమతించలేదు. తాను విఐపి పాస్తో వచ్చానని గజల్ శ్రీనివాస్ తెలిపారు. బి గేట్ ద్వారా రమ్మన్నారని, తాను అటువైపు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సమైక్యవాదాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించడానికి వచ్చినట్లు వంగపండు ప్రసాద్ తెలిపారు. తనని పోలీసులు ఎల్బి స్టేడియం లోపలకు అనుమతించలేదని చెప్పారు. అయితే ఆ తరువాత గజల్ శ్రీనివాస్ను లోపలకు అనుమతించారు. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం స్టేడియం బయటే ఉండి నినాదాలు చేస్తున్నారు. తమను లోపలకు అనుమతించకపోయినా తాము సభ ముగిసే వరకు తాము బయటే ఉండి మద్దతు తెలుపుతామని చెప్పారు.