వేసవి సెలవులు, రద్దీ రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రయాణించేందుకు దక్షిణమధ్య రైల్వే మొదటిసారిగా వినూత్న తరహాలో ‘ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్స్’కు శ్రీకారం చుట్టింది.
విమానాల తరహాలో డైనమిక్ మోడల్ చార్జీలు
సాక్షి,హైదరాబాద్: వేసవి సెలవులు, రద్దీ రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రయాణించేందుకు దక్షిణమధ్య రైల్వే మొదటిసారిగా వినూత్న తరహాలో ‘ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్స్’కు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా ఈ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లలో సాధారణ రిజర్వేషన్ బుకింగ్‌కు అవకాశం ఉండదు. ఇంటర్నెట్ ద్వారా మాత్రమే బుకింగ్ అనుమతిస్తారు. విమానాల తరహాలో డైనమిక్ మోడల్ చార్జీలను తీసుకోనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు వెల్లడించారు. ప్రీమియం ట్రైన్ సర్వీసులలో సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లలోని తత్కాల్ చార్జీలను బేసిక్ చార్జీలుగా నిర్ణయిస్తారు. ప్రీమియం ట్రైన్ సర్వీసు బుకింగ్ ప్రారంభమైన వెంటనే రిజర్వేషన్‌లు చేసుకున్న వారికి తత్కాల్ చార్జీలలోనే బెర్తులు లభిస్తాయి. బెర్తులు భర్తీ అవుతున్న కొద్దీ చార్జీలు పెరుగుతాయి. బుక్ చేసుకున్న తరువాత ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. ప్రయాణ చార్జీలను కూడా తిరిగి చెల్లించరు.
త్వరలో సికింద్రాబాద్-విశాఖ: ఈ నెల 18,19,20 తేదీలలో సెలవులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య ఈ ప్రీమియం ట్రైన్‌ను ప్రకటించారు. ఈ మేరకు సికింద్రాబాద్-విశాఖ ప్రీమియం సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ 17వ తేదీ రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20వ తేదీ రాత్రి 9.10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.