ప్రసవ వేదన వరకూ ప్రజా సేవలో.. | Sakshi
Sakshi News home page

ప్రసవ వేదన వరకూ ప్రజా సేవలో..

Published Fri, Apr 3 2020 12:25 PM

Pregnant Grama Volunteer Distribute Pension in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు: ప్రజలకు అంకితభావంతో సేవలందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు కట్టుబడి ఆ మహిళా వలంటీర్‌ ప్రసవ వేదన వరకూ ప్రజాసేవలోనే నిమగ్నమయ్యారు. గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన వలంటీర్‌ విన్నకోట జ్యోతి గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె  ప్రసవానికి ముందురోజు వరకూ విధుల్లోనే నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామంలో సర్వేలో పాల్గొన్నారు. బుధవారం కూడా పింఛన్‌ లబ్ధిదారులకు నగదు అందజేసి విధుల పట్ల నిబద్ధత చాటుకున్నారు. దీంతో స్థానిక అధికారులు, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కర్రి గౌరీ సుభాషిణి,  వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్రి వేణుబాబు తదితరులు జ్యోతిని అభినందించారు.     

సంకల్ప బలంతోనే..
సీఎం వైఎస్‌ జగన్‌ చదువుకున్న నాలాంటి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రజలకు వలంటీర్లం సేవలందిస్తున్నాం. 1వ తేదీ ఆపన్నులకు పింఛన్‌ ఆగకూడదని సీఎం సంకల్పించారు. అందుకే ఆ సంకల్ప బలంతోనే.. వలంటీర్‌గా నా వృత్తికి న్యాయం చేయాలని ప్రసవ సమయం దగ్గరకు వచ్చినా నా విధి నిర్వర్తించాను. 4వ తేదీన రేషన్‌కార్డుదారులకు కూడా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయాలనుకున్నాను. కానీ ఈలోగా బిడ్డకు జన్మనిచ్చాను.   
– విన్నకోట జ్యోతి, మార్టేరు, వలంటీర్‌ 

Advertisement
Advertisement