పండుగ తర్వాత ‘పవర్‌’ షాక్‌!

పండుగ తర్వాత ‘పవర్‌’ షాక్‌!

  • 18న ఏపీఈఆర్‌సీకి టారిఫ్‌ ప్రతిపాదనలు

  • రూ.7,122 కోట్ల లోటును పూడ్చుకునే ప్రయత్నం

  • సాక్షి, అమరావతి: సంక్రాంతి తర్వాత విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌) కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీన విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి సమర్పించ నున్నాయి. రెండు డిస్కమ్‌లకు కలిపి రూ.7,122 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి.



    వినియోగదారులపై టారిఫ్‌ల పిడుగు

    పరోక్ష రాబడిపై కూడా విద్యుత్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 2016–17కి కొత్త శ్లాబుల వర్గీకరణను తెరపైకి తెచ్చారు. 2015–16లో విద్యుత్‌ వినియోగం 900 యూనిట్లు దాటిన వారిని తర్వాత శ్లాబులోకి తీసుకెళ్లి దొంగ దెబ్బతీశారు. ఇప్పుడు ఈ శ్లాబ్‌ పరిధిని 600 యూనిట్లకు కుదించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించే వీలుంది. అంటే వినియోగదారుడు ఏడాదికి 600 యూనిట్లు విద్యుత్‌ వాడితే... నెలకు (యూనిట్‌కు రూ.1.45 చొప్పున) రూ.72.50ల బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 601 యూనిట్లు వినియోగిస్తే అప్పుడు వినియోగదారుడు తదుపరి శ్లాబులోకి వెళ్తాడు.



    అంటే ప్రతి యూనిట్‌కు రూ.2.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల నెలకు రూ.122.50 వరకూ (అదనంగా రూ.50) బిల్లు వస్తుంది. యూనిట్ల శ్లాబును 900 నుంచి 600కు తగ్గించడం వల్ల దాదాపు 3.5 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. మిగులు విద్యుత్‌ పేరుతో ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యుత్‌ కొనగోళ్లను ప్రోత్సహిస్తోంది. యూనిట్‌ సగటున రూ.5.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. వీటివల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఈ  భారీగా ఆర్థిక లోటు ఏర్పడింది. దీన్ని వినియోగదారుల నుంచే రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top