భారతదేశ ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని తన పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వ్యాపార నిబంధనల కేటాయింపులో అవసరమైన సవరణలు చేయాలని కోరుతూ కేబినెట్ సెక్రటేరియట్‌కు ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతర్జాతీయ సహకారంతో ప్రాజెక్టులు
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పరిధిలోని రియాక్టర్లతో అణు విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే బాధ్యతను తమ మంత్రిత్వ శాఖకు అప్పగించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ప్రస్తుతం, అణు విద్యుత్ రంగానికి సంబంధించిన పూర్తి పరిపాలనా అధికారాలు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆధ్వర్యంలోని అణు శక్తి విభాగం (DAE) వద్ద ఉన్నాయి.
‘శాంతి’ చట్టం
డిసెంబర్ 2025లో ప్రకటించిన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’(SHANE - శాంతి) చట్టానికి ముందే ఈ ప్రతిపాదనలు రావడం గమనార్హం. అణు రంగంలో నియంత్రిత పద్ధతిలో పరిమిత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం ఈ చట్టం ఉద్దేశం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డును (AERB) మరింత బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత, ఇంధనం వంటి కీలక అంశాలు మాత్రం యథాతథంగా డీఏఈ పరిధిలోనే ఉంటాయి.
2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యం
భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌పీసీఐఎల్(డీఏఈ పరిధిలో) దాదాపు 50 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బాధ్యత వహించాలి. ఎన్‌టీపీసీ (విద్యుత్ శాఖ పరిధిలో) సుమారు 30 గిగావాట్ల ఉత్పత్తి చేయాల్సి ఉంది. ‘వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత వంటి ప్రధాన అంశాలు డీఈఏ వద్దే ఉండాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ బాధ్యతలు విద్యుత్ శాఖకు బదిలీ చేయడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నియంత్రణలో స్పష్టత
గతంలోని 1962 అణు శక్తి చట్టం ప్రకారం, టారిఫ్ ధరలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంప్రదింపులతో డీఏఈ నిర్ణయించేది. అయితే, రాబోయే కొత్త నిబంధనలు, ‘శాంతి’ చట్టం ద్వారా టారిఫ్ నిర్ణయాల్లో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉండనుంది.
ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..


