డీఎస్సీ–2018 అభ్యర్థులకు పోస్టింగ్‌లు

Postings for DSC 2018 Candidates Says Vadrevu China Veerabhadrudu - Sakshi

ఈనెల 22న నియామక ఉత్తర్వుల అందజేత

విద్యా శాఖ ఆదేశాలు

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 పరీక్షల్లో మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 డీఎస్సీలో ప్రభుత్వ, జెడ్పీ, మోడల్‌ స్కూళ్లతోపాటు వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమైంది. ఇప్పటికీ కొన్ని కేటగిరీల పోస్టులపై న్యాయ వివాదాలున్నాయి. నియామకాలు ఇంకా జాప్యం కాకుండా ఉండేందుకు న్యాయ వివాదాలు లేని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డీఎస్సీలో ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 22న నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఆయా అభ్యర్థులను ఆన్‌లైన్‌ ద్వారా ఆప్షన్స్‌ ఇచ్చిన స్కూళ్లలోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మెరిట్‌ జాబితా ఆధారంగా పోస్టింగ్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ జాబితాను విద్యా శాఖ కమిషనరేట్‌కు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2,654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అత్యధిక పోస్టులున్న ఎస్జీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియరెన్స్‌ రాగానే ఉత్తర్వులు ఇస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top