అధికారుల్లో గుబులు

Police Take Other Two Persons in Custody maoists Case - Sakshi

పోలీసుల అదుపులో ఇద్దరు

వెంటాడుతున్న లివిటిపుట్టు ఘటన

మరికొంతమందిపై వేటు పడే అవకాశం

సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యోదంతానికి బాధ్యులను చేస్తూ ఒకరి తర్వాత మరొకరిపై చర్యలు తీసుకుంటుండడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. లివిటిపుట్టు ఘటనతో ఎగసిన భావోద్వేగాల నడుమ చెలరేగిన హింసాకాండ కొద్ది గంటల్లోనే సద్దుమణిగినప్పటికీ ఆ దుర్ఘటన మాత్రం అధికారులను వెన్నాడుతోంది. పోలీసుల నిఘా వైçఫల్యాన్ని ఆసరాగా చేసుకుని లివిటిపుట్టు వద్ద మాటు వేసి మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుపెట్టారు. ఆ ఘటనకు పోలీస్‌ బాస్‌గా తానే బాధ్యత వహిస్తానంటూ సాక్షాత్తు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. లివిటిపుట్టు ఘటన తర్వాత చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావుపై సంఘటన జరిగిన మర్నాడే సస్పెన్షన్‌ వేటు వేశారు. అరకు సీఐ వెంకునాయుడ్ని రేంజ్‌ వీఆర్‌కు పంపుతూ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

కొత్తకోట సీఐ కోటేశ్వరరావుకు అరకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. మరోవైపు అందుబాటులో బలగాలున్నా అరకు, డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్లపై దాడిని అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఏపీఎస్పీ ఆఫీస్‌ కమాండర్‌ సమర్పణరావు, ఆర్‌ఎస్‌ఐ సాంబశివరావులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఏపీఎస్పీ ఐజీ ఆర్‌పీ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లివిటిపుట్టు ఘటనతోపాటు అరకు, డుంబ్రిగుడలలో చెలరేగిన హింసాకాండను విచారించడానికి వేసిన సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్‌ సిఫార్సు మేరకే సోమవారం పోలీసు అధికారులపై చర్య తీసుకున్నారు. కాగా మరికొంతమందిపై వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలకు కారణమైన నిఘా వైఫల్యానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోనవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన రోజున ప్రజలు తీవ్ర భావోద్వేగాలతో ఉన్నారని.. ఆ సమయంలో ఎవరు కన్పించినా దాడులు తప్పవని.. బలగాలున్నా వాటిని అదుపు చేయడం కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మరికొంతమందిపై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తుండడంపై ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మాటు వేసిన మావోయిస్టులకు వంటలు చేశారనే ఆరోపణలపై అంత్రిగుడ గ్రామంలో ఇద్దరు గిరిజనులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శోభన్, కమల అనే ఇద్దరు గిరిజనులను ఆదివారం అదుపులోకి తీసుకొని, అరకులోయ స్టేషన్‌కు తరలించామని వారు తెలిపారు. సిట్‌ బృందంలోని పోలీసు అధికారులు ఈ ఇద్దరు గిరిజనులను స్థానిక పోలీసు అతిథి గృహంలో విచారిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన శోభన్, కమలలు అమాయకులని, వారిని విడిచిపెట్టాలని పోలీసు అధికారులను కోరేందుకు అంత్రిగుడ గ్రామంలోని గిరిజనులంతా అధిక సంఖ్యలో సోమవారం పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. కొంతమందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇచ్చి శోభన్‌తో మాట్లాడించారు. కమలతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంత్రిగుడ గిరిజనులు వాపోయారు. వారిని వెంటనే విడిచిపెట్టాలని అంత్రిగుడ గిరిజనులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top