ఆమెకు అన్యాయం

police support to TDP Civil danda in Amravati - Sakshi

టీడీపీ సివిల్‌ దందా.. పోలీస్‌ పంథా

రూ.2కోట్ల ఆస్తి వివాదంలో అత్యుత్సాహం

ఎప్పటి నుంచో ఉంటున్న ఇల్లు   ఖాళీ చేయమని హుకుం

గడువు ఇవ్వాలని కోరినా వినకుండా వివాదం

కోట్ల విలువైన స్థలం.. అందులో ఓ చిన్న పెంకుటిల్లు.. చుట్టూ ఖాళీ జాగా.. ఏళ్లుగా అందులోనే తలదాచుకుంటున్న ఓ పేద వృద్ధురాలు..  ఆ ఆస్తి ఎవరిదనే దానిపై అస్పష్టత. కొన్ని వర్గాల మధ్య వివాదం. ఇంతకంటే భూదందాకు టీడీపీ నేతలకు అవకాశం ఏముంటుంది? సివిల్‌ దందాలో బెదిరించాలంటే పోలీసులకు ఇంకేం కావాలి? ఫలితం.. కొన్నిరోజులుగా ఆ పేద మహిళ పోలీసుల వేధింపులతో నలిగిపోతోంది. అక్రమ నిర్బంధంతో పోలీసుస్టేషన్‌లోనే బిక్కుబిక్కుమంటోంది. విజయవాడలో సివిల్‌ దందాలు.. అందులో పోలీసుల అత్యుత్సాహానికి తాజా తార్కాణం ఇది.

సాక్షి, అమరావతిబ్యూరో: అది విజయవాడలోని కరెన్సీనగర్‌. అందులో దాదాపు రూ.2 కోట్ల విలువచేసే ఖాళీ స్థలం. అందులో ఓ చిన్న పాత పెంకుటిల్లు, దానిచుట్టూ పెద్ద ఖాళీ జాగా. ఆ పెంకుటిల్లులో ఎన్నో ఏళ్లుగా ఓ పేద మహిళ నివసిస్తోంది. ఆ స్థలం హక్కుల గురించి కొందరి మధ్య వివాదం దీర్ఘకాలంగా ఉంది. కానీ, ఆ మహిళ ఏళ్లుగా ఆ పెంకుటింటిలోనే నివసిస్తోంది. ఆమెకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ కూడా అదే చిరునామాతో ఉన్నాయి. ఆమె చిన్నచిన్న పనులు చేస్తూ పిల్లలను పోషించింది. కొడుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆమె మాత్రం అందులోనే నివసిస్తోంది.

కాగా, కొన్నిరోజుల క్రితం అదే ప్రాంతంలో ఉండే టీడీపీ స్థానిక నేత ఒకరు వచ్చి ఆ ఇల్లు, ఖాళీస్థలం తనదని, ఖాళీ చేయమని చెప్పారు. అందుకు ఆమె కొంత సమయం అడిగింది. తన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ ఇదే చిరునామాతో ఉన్నాయని, తన కొడుకు అడ్రస్‌ ప్రూఫ్‌ అవేనని చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే మరో ఇంటికి మారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను ఆ చిరునామాకు మార్పించుకుంటానని తెలిపింది. అందుకు ఆ టీడీపీ నేత ససేమిరా అన్నాడు. రెండు మూడు రోజుల్లోనే ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి ఆ ఇల్లు, ఖాళీ స్థలం తనవని, ఖాళీ చేయాలని గొడవ చేశారు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థంకాలేదు.

అక్రమ నిర్బంధం
ఈ విషయం తెలియడంతో టీడీపీ నేత వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని, అంతకుముందే ఆమె ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో చిరునామా మార్చాలని ఒత్తిడి చేశారు. అందుకు కొంత సమయం కావాలని ఆమె కోరడంతో పోలీసులను తెరపైకి తెచ్చారు. ఓ మధ్యస్థాయి అధికారి, ఓ స్టేషన్‌ అధికారి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. టీడీపీ నేత చెప్పినట్లు వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో ఆ ఇంటి చిరునామాను మార్చాలని కూడా ఒత్తిడి చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా తమదైన శైలిలో హెచ్చరించారు. దీంతో ఆమె హడలిపోయింది. ఆ ఆస్తి తనది కాదని స్పష్టం చేస్తూనే తన కొడుకు వచ్చి మరో ఇంటికి మారే వరకు గడువు ఇవ్వాలనే మాత్రమే కోరుతున్నానని తెలిపింది. అందుకు టీడీపీ నేత, పోలీసులు ససేమిరా అన్నారు.

 ఖాళీ పత్రాలపై సంతకాలు చేయడంతోపాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో చిరునామా మార్చే వరకు విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. కొన్నిరోజులుగా ఆమె పోలీస్‌స్టేషన్‌ వద్దే ఉంటోంది. మరో మాటలో చెప్పాలంటే ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లే. ఆమె సమీప బంధువులు.. టీడీపీ నేత, పోలీసులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. అది సివిల్‌ వ్యవహారం. నిబంధనల ప్రకారం పోలీసులు అందులో జోక్యం చేసుకోకూడదు. అందులోనూ ఓ మహిళను నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌ స్టేషన్‌లో బలవంతంగా ఉంచడం దారుణం. కానీ, టీడీపీ నేతకు సివిల్‌ దందాలో కొమ్ముకాస్తున్న ఆ ఇద్దరు పోలీసు అధికారులకు ఇవేమీ పట్టట్లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top