
తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..
సాక్షి, పశ్చిమ గోదావరి : తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ స్పందించారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భద్రతను కూడా పెంచుతున్నామన్నారు. జిల్లాలో ఆయన పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని, ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు’ అని గురువారం ఏలూరు బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.