గన్‌దరగోళం | Sakshi
Sakshi News home page

గన్‌దరగోళం

Published Thu, Sep 27 2018 1:59 PM

police Coombing In West Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా మారిందా? ఈ ప్రశ్న పోలీసులను వేధిస్తోంది. అరకు ఘటనతో పోలీసుశాఖలో టెన్షన్‌ మొదలైంది. ఎమ్మెల్యే హత్యకేసులో కీలకంగా వ్యవహరించిన స్వరూపకు భీమవరంతో సంబంధాలు ఉండటంతో అక్కడ గురువారం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. మరోవైపు కీలక ప్రాజెక్టు పోలవరం కూడా ఇక్కడే ఉండటంతో అక్కడ బందోబస్తు పెంచారు.  ఈనెల 23న అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన  మావోయిస్టుల్లో భీమవరం పట్టణానికి చెందిన మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్‌ స్వరూప ఉన్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు బీమవరంలోని ఇందిరమ్మ కాలనీలో తనిఖీలు చేశారు.  నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌కు చెందిన 25 మంది సీఐలు, ఎస్సెలు 150 మంది సిబ్బంది కాలనీలోని ఇంటింటికీ వెళ్లి ఆధార్‌కార్డులు, వాహనాల ధ్రువపత్రాలను తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో గతం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి పెద్ద సంఖ్యలో వెళ్లిన దాఖలాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

1970 నుంచి నక్సల్స్‌ ప్రభావితం
పశ్చిమ ఏజెన్సీని మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గానే వాడుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. 1970వ దశకం నుంచి పశ్చిమ ఏజెన్సీ నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతంగా ఉంది. అప్పట్లో న్యూడెమోక్రసీ దళాలనే సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా దళాలుగా పిలిచేవారు. పశ్చిమ ఏజెన్సీలో ప్రధానంగా సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ దళాలు గట్టి పట్టును కలిగి ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. కేవలం గిరిజనుల తరుఫున వారి హక్కుల కోసం,వారి జీవన భృతి కోసం పోరాటం చేయడమే తప్ప హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు.  న్యూడెమోక్రసీ దళాలు పట్టు కలిగి ఉండటంతో అప్పట్లో పీపుల్స్‌వార్‌ గ్రూపు ఈ ప్రాంతంలోకి వచ్చినా ఇక్కడ ఉండేవారు కాదు. నక్సలైట్‌ వర్గాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం ఒక ప్రాంతంలో ఒక వర్గం పనిచేస్తే ఆ ప్రాంతంలో మరో వర్గం ఉండకూడదు. ఈ నేపథ్యంలో పీపుల్స్‌వార్‌ గ్రూపు నక్సలైట్లు ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. ఆ తరువాత కాలంలో నక్సలైట్‌ గ్రూపులన్నీ కలిసి మావోయిస్టులుగా మారడంతో అప్పటి నుంచి వారు ఈ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, ఆంధ్రా, ఒడిశా బోర్డర్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణలో ఎక్కడ ఎన్‌కౌంటర్లు జరిగినా, గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించినా మావోయిస్టు దళాలు తలదాచుకునేందుకు పశ్చిమ ఏజెన్సీకి వచ్చేవని తెలుస్తోంది. దీంతో న్యూడెమోక్రసీ దళాలూ  వాటిని పట్టించుకునేవి కాదని సమాచారం. దీంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు రావడం, కొద్ది రోజులు ఉండి వెళ్లిపోవడం తరుచుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏజెన్సీలో అడపాదడపా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

జిల్లాలో గత అనుభవాలివే..
1990లో తొలిసారిగా న్యూడెమోక్రసీ దళ సభ్యుడు అర్జా నాగన్నను మడిమి పెంటయ్య అనే గిరిజనుడు చంపడంతో తిరిగి న్యూడెమోక్రసీ దళాలు కామవరం వద్ద పెంటయ్యను కాల్చి చంపాయి.  2000 మార్చి 17న పోలవరం మండలం చిలకలూరు   జలతారు వాగు వద్ద తొలిసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోలుసహా, బి.నాగేంద్రప్రతాప్‌ అనే కానిస్టేబుల్‌ మృతిచెందాడు. అదే ఏడాది జూలై 30న బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురం వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీనిలో వీరన్నదళం డెప్యూటీ కమాండర్‌ నరకాసుర మృతిచెందారు. నవంబర్‌లో  పట్టిసీమ వద్ద పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆటోలో వెళుతున్న ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. రెండునెలలు గడవకుండానే 2001 జనవరి 12న ఊట్లగూడెం సమీపంలో న్యూడెమోక్రసీ దళం ప్లీనరీ జరుగుతుండగా పోలీసులు చుట్టుముట్టారు. ఇరువర్గాల కాల్పుల్లో దళ కమాండర్‌ ధర్మన్నతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లూ మృతిచెందారు. 2004 నవంబర్‌ 16న జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో దళ కమాండర్‌ చింతా భాస్కరరావు అలియాస్‌ రమేష్‌ అలియాస్‌ ప్రభాకర్‌ అలియాస్‌ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2005 మార్చి 18న క్రాంతి దళం బుట్టాయగూడెం మండలం పందిరమామిడిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సును తగులబెట్టింది. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రకటించింది.

పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేటలో ఇన్ఫార్మర్‌ అనే నెపంతో వ్యాపారి కొల్లూరి గోపాలకృష్ణను క్రాంతి దళం కాల్చి చంపింది. 2005 ఏప్రిల్‌ 6న పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట డేరాకొండ సమీపంలో జనశక్తి కార్యదర్శి క్రాంతితో పాటు దళ సభ్యుల సమాచారం తెలిసి గ్రేహౌండ్‌ పోలీసులు చుట్టుముట్టగా ఇరువర్గాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. 2005 మే 23న జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో గెద్దాల సరితను అరెస్టు చేసి 8ఎంఎంరైఫిల్, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట సమీపంలో 2005 జూలై 9న జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజన్న వర్గానికి చెందిన ఇద్దరు దళ సభ్యులు మృతిచెందారు. 2006 సెప్టెంబర్‌ 13న పోలవరం మండలం ములకలగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. 2008 జూలై 10న బుట్టాయగూడెం మండలం రెడ్డికోపల్లెలో 9 మంది దళసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. 2014లో డిసెంబర్‌ 15న జంగారెడ్డిగూడెం సమీపంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన 13మందిని అరెస్టుచేసి 9 తుపాకులు, 344 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. 2016 అక్టోబర్‌ 24న ఏవోబీ సరిహద్దు జంత్రి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు జిల్లాలోని దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన దాసు, తాళ్ళపూడికి చెందిన దాసు బావమరిది కిరణ్‌ మృతిచెందారు. 2017 ఏప్రిల్‌ 1వ తేదీన సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన దళ సభ్యులను ముగ్గురిని అరెస్టు చేసి వీరి నుంచి ఒక విదేశీ రివాల్వర్, 10 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక కాంట్రాక్టర్‌ను హతమార్చేందుకు వీరు కుట్రపన్నారన్న ఆరోపణపై అరెస్టు చేశారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. మరోవైపు మైదాన ప్రాంతంలోనూ మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్నవారిపై దృష్టి పెట్టారు.

Advertisement
Advertisement