ఏఓబీలో ముమ్మర గస్తీ

Police Coombing in Srikakulam AOB - Sakshi

శ్రీకాకుళం, కాశీబుగ్గ : మావోయిస్టులు నిరసన వారోత్సవాలలో భాగంగా ఈ నెల 31న బంద్‌కు పిలుపునివ్వడంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పోలీసు బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. అడుగడుగునా జల్లెడ పడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్బంధంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉక్కుపాదం మోపడంతో కొన్ని దళాలు మహేంద్రగిరుల బాటపట్టాయి. అక్కడి నుంచి అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తుండటం, వారు ఉనికి ని చాటుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కాశీబుగ్గ పోలీసు డివిజన్‌ పరిధిలోకి రోప్‌టీం(ప్రత్యేక పోలీసు బలగాలు) చేరుకుని గొప్పిలి, లొత్తూరు తదితర  గిరిజన తండాల్లో జల్లెడపట్టాయి. కాశీబుగ్గ ఏఎస్‌ఐ ఫణిదాస్‌ ఆధ్వర్యంలో లొద్దబద్ర నుంచి హిమగిరి, దానగోర రోడ్లలో తనిఖీలు నిర్వహించారు.

ప్రయాణికులకు తప్పని పాట్లు
భామిని: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల అప్రకటిత బంద్‌ ఆరంభమైంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమాధాన్‌ పేరున చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరశనగా, మావోయిస్టుల ఏరివేతలు, గిరిజనుల హక్కులను కాలరాయడం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ నిరశన వారోత్సవాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నిరసన వారోత్సవాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీస్‌లు అప్రమత్తమయ్యారు. నారు.ఈ నెల 31న ఏఓబి బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు సీఎం సభకు బస్సులన్నీ తరలిపోగా, మిగిలిన ఒక బస్సును కూడా రాత్రి తొమ్మిది గంటలకు కొత్తూరులో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top