క్రికెట్‌ బుకీల అరెస్టు

Police Busted Hi-Tech Cricket Betting Racket in Vijayawada - Sakshi

పోలీసుల అదుపులో ప్రధాన బుకీ, మరో 21 మంది    నిర్వాహకులు

 రూ. 13 లక్షల నగదుతోపాటు కారు, బైకులు స్వాధీనం

సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు,   టీవీ సీజ్‌

సాక్షి, అమరావతిబ్యూరో: ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు వినియోగిస్తూ ఆన్‌లైన్‌లో రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన బుకీ సప్పా రవిచంద్ర మౌలిని విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బుకీతోపాటు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మరో 21 మందిని కూడా అదపులోకి తీసుకుని వారివద్ద నుంచి సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు, టీవీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల జరిగిన ఆసియా కప్‌ క్రికెట్‌ పోటీల సందర్భంగా నగరంలో ‘బంతి బంతికి బెట్టింగ్‌’ అనే శీర్షిక పేరిట సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసు కమిషనర్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు చేసే బాధ్యతలను సిటీ టాస్క్‌ఫోర్సు పోలీసులకు అప్పగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధాన బుకీతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. 

విజయవాడ కేంద్రంగా బెట్టింగ్‌.. 
నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు విజయవాడ కేంద్రంగా రాజ మండ్రి, గుంటూరు, భీమవరం తదితర ప్రాం తాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై టాస్క్‌ ఫోర్సు పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యం లో గత నెల 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంట్లో రెండో అంతస్తులో ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 19 సెల్‌ఫో న్లు, ఎల్‌ఈడీ టీవీ, ఒక కారుతోపాటు రూ. 1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడ, గుం టూరు నగరాలకు చెందిన మరో 12 మందిని కూ డా అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.51 లక్షల నగదుతోపాటు 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

‘టాస్క్‌ఫోర్సు’ దాడులతో గుట్టురట్టు..
నగరంలో ఒకే రోజు క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేశాక.. టాస్క్‌ఫోర్సు పోలీసులు ప్రధాన బుకీ కోసం వేట ప్రారంభించారు. గత నెలలోనే ఇబ్రహీంపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. సప్పా రవిచంద్ర నగరానికి వచ్చాడన్న సమాచారంతో పోలీసులు శనివారం అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక లాప్‌టాప్‌తోపాటు రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ‡రవీచంద్ర ఇచ్చిన సమాచారంతో గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌ నగరాలకు చెందిన ఆరు మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

నేరాలపై ఉక్కుపాదం : సీపీ
రాజధాని ప్రాంతంమైన విజయవాడలో క్రికెట్‌ బెట్టింగ్, హైటెక్‌ వ్యభిచారం, సైబర్‌ నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీసు కమిషనర్‌ ద్వారాక తిరుమలరావు స్పష్టం చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ప్రధాన బుకీ రవిచంద్ర అరెస్టు చేసిన సందర్భంగా శనివారం సీపీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎవరైనా క్రికెట్‌బెట్టింగ్‌లు నిర్వహించినా.. పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని.. రౌడీషీట్‌లు తెరవడంతోపాటు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని.. బహిష్కరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top