'కోదండరామిరెడ్డిని పోలీసులు కొట్టారు'

ఉరవకొండ: యువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బ్యాంకు అధికారుల వేధింపులకు తోడు పోలీసులు కొట్టడంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడని రాయంపల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కోదండరామిరెడ్డిని పోలీసులు కొడుతుండగా తాము ప్రత్యక్షంగా చూశామని చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ ఆదేశాల మేరకే అతడిని పోలీసులు కొట్టారని వెల్లడించారు.
బ్యాంకు మేనేజర్ నే నిలదీస్తావా అంటూ అతడిపై పోలీసులు చేయిచేసుకున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన కోదండరామిరెడ్డి(29) గురువారం ఉరవకొండ సిండికేట్ బ్యాంకు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం చెల్లించినా పాసు పుస్తకం ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించడంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.