టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..

Polavaram Expats Said TDP Govt Cheated On Construction of houses In East Godavari  - Sakshi

సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి): గత టీడీపీ ప్రభుత్వం తమను నిండా ముంచిందని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఎంఆర్‌సీలో సోమవారం ఆదివాసీ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ ఫోరం (ఏడీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో పది గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారం గ్రామానికి చెందిన కె.వెంకట రమణ మాట్లాడుతూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ విషయంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు మోసం చేశారని ఆరోపించారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మూడు రకాల ఇళ్ల నమూనాలను కాగితాలపై చూపించారు. అయితే ఇళ్లను మాత్రం ఆ నమూనాల్లో నిర్మించడం లేదన్నారు. అధికారులకు నచ్చిన విధంగా కాంట్రాక్టర్‌ ఇళ్లు కట్టుకుంటూ వెళ్లారని, స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణంలో నిర్వాసితుల ప్రమేయం లేకుండా చేయడం దారుణమని ఆయన విమర్శించారు. గ్రామసభల్లో అధికారులు చెప్పిన మాటలకు.. క్షేత్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలకు పొంతన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ముంపునకు గురికాని భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని సరుగుడు గ్రామంలో ముంపునకు గురికాని భూములకూ నష్టపరిహారం చెల్లించారని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ పైభాగంలో ఉన్న ఐదు మండలాల్లో ముంపునకు గురికాని భూమి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ భూముల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. జీవనోపాధి కోల్పోయే రైతులను అదుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్‌అంఆర్‌ ప్యాకేజీ వర్తింప జేయాలన్నారు. పశ్చిమ గోదావరిలో కట్‌ ఆఫ్‌ డేట్‌కు సంబంధం లేకుండా ఖాళీ చేసిన గ్రామాల్లో ఒప్పంద పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అదే విధంగా ఒప్పంద పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అగ్రహారానికి చెందిన అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ నచ్చిన చోట ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. అందరికీ ఒక్క చోటే ఇళ్ల నిర్మాణం చేశారన్నారు. దీంతో అందరికీ ఉపాధి ఉండే పరిస్ధితి లేదు.

ఏనుగులగూడెం గ్రామానికి చెందిన కుంజం భద్రం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యంతోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గోదావరిలో వరద నీరు ఆందోళన కలిగిస్తుందని ఇంటి వద్ద ఫొటోలు తీసుకునేందుకు రావాలని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్‌కు నష్టం జరగకుండా, బిల్లుల చెల్లింపు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కొమరం పోశమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి అబ్బాయిరెడ్డి, మాజీ సర్పంచి కొమరం కన్నయ్యమ్మ, ఏడీఆర్‌ఎఫ్‌ సభ్యుడు జి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top