'పే' స్కూల్స్‌..!

Play School Market crosses thousands of crores - Sakshi

వేల కోట్లు దాటిన ప్లే స్కూల్‌ మార్కెట్‌

నగరాల్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు

అప్పులు చేసి మరీ చేర్పిస్తున్న దిగువ తరగతి కుటుంబాలు

ఏటా 32% వృదిలో దేశీయ ప్లే స్కూల్‌ మార్కెట్‌

సాక్షి, అమరావతి : ‘నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. ప్లే స్కూల్లో వెయ్యాలి. పిల్లల బుర్రలు ఐదేళ్లలోపు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు బాగా నేర్పిస్తే తర్వాత చదువుల్లో బాగా ఎదుగుతారు’.. అంటోంది లలితమ్మ. నాలుగిళ్లల్లో పనిచేస్తేనే ఆమె కుటుంబం గడుస్తుంది. ఆయినప్పటికీ అప్పుచేసి మరీ తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించింది.

‘నా కూతురి ప్లే స్కూలుకు చెల్లించిన ఫీజు నేను ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చెల్లించిన ఫీజుకు రెట్టింపుగా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా నా బిడ్డ ఎదగాలనే కోరికతో అప్పుచేసి మరీ చేర్పించా’నంటున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీరామ్‌.

..ప్లేస్కూళ్ల యజమానులు సాగించే ప్రచారం ఏ స్థాయిలో ఉందో.. కిందిస్థాయి వర్గాలను సైతం అది ఏ విధంగా ప్రభావితం చేస్తోందో గ్రహించడానికి ఇదో ఉదాహరణ. ప్రధానంగా పై తరహా ఆలోచన విధానమే ప్లే స్కూళ్ల మార్కెట్‌ ఏటా 32 శాతం వృద్ధితో దూసుకుపోయేందుకు కారణమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే వారే లేకపోవడం.. పిల్లల భవిష్యత్తు గురించి పెద్దలు భారీగా కలలు కనడం, పోటీ ప్రపంచంలో తమ పిల్లలు  వెనుకబడిపోతారేమోనని భావిస్తుండటం వంటి అంశాలు.. ప్లే స్కూళ్ల విస్తరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం వంటివి కూడా ప్లే స్కూల్‌ మార్కెట్‌ పెరగడానికి దోహదం చేస్తున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్‌ సంస్థలు సాగిస్తున్న భారీ ప్రచారం కూడా పెద్దల్ని కొంతమేర ప్రభావితం చేస్తోంది. అయితే, పెద్దలు ఈ తరహా ప్రచారంలో కొట్టుకుపోరాదంటున్నారు హైదరాబాద్‌కు చెందిన చైల్డ్‌ సైకాలజిస్ట్‌ సి.వీరేందర్‌. ‘హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని భవిష్యత్తు పేరుతో ఒత్తిడికి గురిచేయొద్దు. వాళ్లను కుటుంబంతో, తాతయ్య అమ్మమ్మలతో గడపనివ్వండి’ అని సలహా ఇస్తున్నారు. 

వేల నుంచి లక్షల్లో ఫీజులు..
నిన్నమొన్నటి వరకు కేవలం నగరాలకే పరిమితమైన ప్లే స్కూళ్ల సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. ‘సాక్షి’ పరిశీలన ప్రకారం.. నగరాల్లో పేరున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖ, తిరుపతిలోని ప్లే స్కూళ్లలో లక్ష, లక్షన్నర రూపాయల ఫీజు కడితేనే సీటు. విజయవాడలో సీటు కావాలంటే పాతిక వేల నుంచి లక్ష వరకూ చెల్లించాల్సిందే. హైదరాబాద్‌ నగరంలోని టాప్‌ ప్లే స్కూళ్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు కట్టించుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన కంగారు, యూరో కిడ్స్, బచ్పన్, కిడ్జస్‌ వంటి సంస్థలు నగరాన్ని బట్టి ఫీజుల్ని నిర్దేశిస్తున్నాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. విజయవాడలో ఏర్పాటుచేసిన ప్లే స్కూళ్లల్లో ఆశించిన రీతిలో పిల్లలు చేరలేదు. సచివాలయం వచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాల్ని ఇక్కడకు తీసుకురాకపోవడంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటున్నారు విజయవాడలోని బచ్పన్‌ ఫ్రాంఛైజ్‌ నిర్వాహకులు కాళేశ్వరరావు.

ఒంటరిగా ఉంచలేక..
ఐదేళ్లు వచ్చే వరకు మా అబ్బాయిని బడికి పంపకూడదనుకున్నాం. కానీ, ఇంతలో తిరుపతికి బదిలీ అయ్యింది. మూడు గదుల ఇంటిలో నేనూ, మా వారూ, బాబు మాత్రమే ఉంటున్నాం. అదే మా ఊళ్లో అయితే ఆడుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ బయటకు వెళ్లే అవకాశమే లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ప్లే స్కూల్‌కు పంపుతున్నాను. 
    – బి.వీణ, తిరుపతి

పిల్లలతో కలసి ఉంటారని..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరమూ ఉద్యోగానికి వెళ్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. పిల్లాణ్ణి ఇంటి దగ్గరుంచితే వీడియో గేమ్స్, మొబైల్‌ ఫోన్‌ వదలడు. ఫిజికల్‌ గేమ్స్‌ ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే ప్లే స్కూలుకి పంపుతున్నాం. అక్కడ ఉల్లాసంగా గడిచిపోతుంది. పైగా నాలెడ్జ్‌ కూడా అందుతుంది. 
    – మాధురి, తల్లి, విశాఖపట్నం

నిరుడు ఇద్దరే.. ఇప్పుడు 45 మంది
ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే స్కూల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందుకు మా స్కూలే ఉదాహరణ. ఏడాది కిందట ఇద్దరు పిల్లలతో స్కూల్‌ ప్రారంభించాం. ఇప్పుడు పిల్లల సంఖ్య 45కి చేరింది. ప్లే స్కూల్లో పిల్లలపట్ల తగిన కేర్‌ తీసుకుంటాం. అవసరమయ్యే శిక్షణను అందిస్తాం. వీటి నిర్వహణ చాలా కష్టం.
– మల్లిక, ప్రిన్సిపల్, లిటిల్‌ డాక్‌లింగ్‌ స్కూల్, విశాఖపట్నం

కేంద్రం ఏం చెబుతోంది?
కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ చైల్డ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ’ (ఈసీసీఈ–2013) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు విద్య, ఆటపాటలు నేర్పాలి. ప్రైవేటు సంస్థలు కూడా ఈ పాలసీ తాలూకు విధివిధానాలకు కట్టుబడి నడుచుకోవాలి. 
- ప్రతీ 20 మంది పిల్లలకు ఒక టీచరు, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. 
ప్లేస్కూల్‌ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. 
పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. 
పిల్లలకు అనుకూలమైన బాత్రూంల ఏర్పాటు, సీసీటీవీ, అగ్నిమాపక రక్షణ పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కలిగి ఉండాలి. 
ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించాలి. 
ముఖ్యంగా రోజుకు 3–4 గంటలకు మించి ప్లే స్కూల్‌ నిర్వహించకూడదు. 
చిన్న పిల్లలకు ఏం నేర్పించాలనే దానిపై కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బోధన ప్రణాళిక రూపొందించింది. ప్రతీ ప్లే స్కూల్‌ నిర్వాహకులు దీన్ని విధిగా పాటించాల్సి వుంది. ఈ దిశగా.. శిశు సంక్షేమ శాఖ తనిఖీలు జరపాల్సిన అవసరముందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top