మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం | Private schooling quietly draining India middle class | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం

Jul 15 2025 11:29 AM | Updated on Jul 15 2025 11:37 AM

Private schooling quietly draining India middle class

లాభాపేక్ష లేని సంస్థలుగా పని చేయాల్సిన విద్యాసంస్థలు కార్పొరేట్‌ మాఫియాగా మారి తల్లిదండ్రుల నుంచి భారీగా దన్నుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని యాజమాన్యాలు చెప్పినకాడికి ముట్టజెప్పుతున్నారు. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం కంటే నిశ్శబ్దంగా విద్యా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ప్రైవేట్ విద్య ఆర్థిక సవాలుగా మారిందని, పెరుగుతున్న పాఠశాల ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నట్లు విద్యావేత్త, చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో చిన్నారికి రూ.3.5 లక్షల వరకు..

గోయల్ లింక్డ్ఇన్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లోని చాలా పాఠశాలల్లో ప్రైమరీ విద్య కోసం సుమారుగా అడ్మిషన్ ఛార్జీలు రూ.35 వేలు, ట్యూషన్‌ ఫీజు రూ.1.4 లక్షలు, వార్షిక ఛార్జీలు రూ.38 వేలు, రవాణా ఫీజు రూ.44 వేల నుంచి రూ.73 వేలు, పుస్తకాలు, యూనిఫామ్‌లకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు బాదుతున్నారు. అంటే ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2.5-రూ.3.5 లక్షలు’ అని చెప్పారు.

ఫీజుల కోసం ఈఎంఐలు..

‘మిడ్ టైర్ స్కూళ్లు కనీసం రూ.లక్ష ఫీజుతో ప్రారంభిస్తున్నాయి. ఎలైట్ స్కూళ్లు ఈజీగా రూ.4 లక్షలతో అ‍డ్మిషన్‌ మొదలు పెడుతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాం, కానీ విద్యా ద్రవ్యోల్బణం మధ్యతరగతి పాలిట శాపంగా మారుతోంది. ఫిన్‌టెక్‌ సంస్థలు ఇప్పుడు పాఠశాల ఫీజుల కోసం ఈఎంఐలను అందిస్తున్నాయి’ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానం

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యామ్నాయం కాదు. అందులోనూ 8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క యూపీలోనే 5వేల పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థుల్లో 70 శాతం మంది పేరాగ్రాఫ్ చదవలేని పరిస్థితులున్నాయి. విద్యుత్ లేని లక్ష పాఠశాలలున్నాయి. మరుగుదొడ్లు లేని 46,000 పాఠశాలలు, తాగునీరు లేని పాఠశాలలు 39,000 ఉన్నాయి. భారతదేశం జీడీపీలో కేవలం 4.6% మాత్రమే విద్యపై ఖర్చు చేస్తుంది. వివిధ కమిటీలు సిఫార్సు చేసిన 6% కంటే ఇది చాలా తక్కువ.

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ నిధి విడుదలకు డేట్‌ ఫిక్స్‌?

ఏం చేయాలంటే..

‘చట్టపరంగా లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థలోని చాలా లొసుగులను అన్వేషిస్తున్నాయి. డొల్ల కంపెనీల ద్వారా యజమానులు తమ సొంత పాఠశాలలకు ఆస్తులను లీజుకు ఇవ్వడం, అధిక అద్దెలు వసూలు చేయడం, బిల్లును ఫీజుల రూపంలో తల్లిదండ్రులకు పాస్‌ఆన్‌ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల నుంచి తప్పించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు’ అని గోయల్ తెలిపారు.  ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్‌ విద్యా సంస్థల ఆర్థిక దోపిడిని కట్టడి చేయాల్సి ఉంది. కొందరు అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి తల్లిదండ్రుల నెత్తిన భారం మోపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన పరిస్థితులపై యంత్రాంగం దృష్టి సారించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement