మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఒంగోలు, న్యూస్‌లైన్: మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు భారీగా దిగుమతి అవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై సమరసాక్షి కథనం..
జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు,నాలుగు నగరపాలక సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలనా విభాగం నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ‘చెత్తపై కొత్త సమరం’ పేరుతో గతంలో వందరోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వ్యర్థాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. ఒంగోలులో 2010 డిసెంబర్‌లో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై దాడులు విపరీతంగా జరిగాయి.
వీటిపై ప్రజారోగ్యశాఖ అప్పట్లో అవగాహనా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుతం రోడ్లపై చెత్త కనపడకుండా చేయడంలో చూపుతున్న శ్రద్ధ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడంలో చూపించడంలేదు. అన్ని మార్కెట్లు, షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా ఉంటోంది. 40 మైక్రాన్ల కన్నా అధిక మందం కలిగిన రకాల ప్లాస్టిక్ కవర్లను వినియోగించేందుకు అవకాశం ఉన్నా వాటి వినియోగం పెరిగే కొద్దీ అనర్థమే.
ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవాలంటే కనీసంగా వెయ్యి సంవత్సరాలు పడుతుందనేది శాస్త్రవేత్తల అంచనా. పట్టణాల్లో కర్రీ పాయింట్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చే ఆహార పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరగడం వల్ల వాటిని భుజించే వారికి పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వినియోగం పెంచాల్సి ఉంది. తొలి దశలో క్లాత్ బ్యాగులు చాలా షాపుల్లో దర్శనమిచ్చాయి. కానీ ప్లాస్టిక్ వాడకానికి అలవాటుపడిన వారు వాటిని పట్టించుకోకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది.
ఒంగోలు నడిబొడ్డున ఉండే ఊరచెరువు మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉంటోంది.
మార్కాపురం, పొదిలి పట్టణాల్లో ప్లాస్టిక్ వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. హోటళ్లలో సైతం ఆహార పదార్థాలు ప్యాక్ చేసేందుకు వీటినే వినియోగిస్తున్నారు.
యర్రగొండపాలెం, పర్చూరు వంటి గ్రామీణ ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలకు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్నారు.
చీరాలలో రెండు నెలల నుంచి దాడులు ఉధృతంగా నిర్వహిస్తుండడంతో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం బాగా తగ్గింది. అయితే కర్రీ పాయింట్లు, హోటళ్లలో మాత్రం ఇంకా వీటినే వాడుతున్నారు.
చీమకుర్తిలో కమిషనర్ ఉన్నా హెల్త్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అక్కడ తనిఖీలు కూడా లేకుండా పోయాయి.
గిద్దలూరులో మాత్రం తనిఖీలు చేసి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇంకా జరిమానాల పరంపర ప్రారంభం కాలేదు. అద్దంకిలో శనివారం ఆరుగురి నుంచి ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని *4250 జరిమానా విధించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను హైవేల వెంబడి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగలబెడుతున్నందు వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. పాడైపోయిన కంప్యూటర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలను నిక్షిప్తం చేసేందుకు కూడా సరైన ప్రణాళిక అవసరం. డంపింగ్ యార్డులు లేకపోవడంతో చాలాచోట్ల వీటిని పట్టించుకోవడం లేదు. చిత్తశుద్ధితో దృష్టిసారిస్తే అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో వీటిని అరికట్టడం సాధ్యమే.