8 కారిడార్లు.. 140.13 కి.మీ

Planning To Visakha Metro Rail Project - Sakshi

లైట్‌ మెట్రో ఏర్పాటుకు ప్రణాళికలు

రూ.8,300 కోట్లతో ప్రాజెక్టు

సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

కారిడార్‌ మార్గాల్ని పరిశీలించిన మంత్రులు బొత్స, ముత్తంశెట్టి

సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజె క్టు పట్టాలెక్కుతోంది. ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగన మే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 3 కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్‌ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్‌ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కి అప్పగించారు.

మెట్రో నుంచి.. లైట్‌ మెట్రోగా...
పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్‌ఎఫ్‌పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి.. మెట్రో రైల్‌ కాకుండా లైట్‌ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్‌ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టుని సిద్ధం చెయ్యగా.. లైట్‌ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్‌ మెట్రో వల్ల.. ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా.. రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతా యి. సాధారణంగా ఒక మెట్రో రైల్‌ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్‌ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి.  అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ 52 శాతం భరించగా.. మిగిలిన 48 శాతం నిధుల్ని సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,200 కోట్లు కొరియా నుంచి రుణం తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అప్పట్లో ప్రయత్నించింది. తరువాత మరుగున పడిపోయింది.

తొలిదశలో 35 కి.మీ.. కానీ...
వాస్తవానికి 2016 పనులు ప్రారంభించాలన్నది మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొదటి లక్ష్యం. కానీ అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులూ చేస్తూ కాలయాపన చేసింది. 2016లో పనులు ప్రారంభించి తొలిదశలో 35 కి.మీ వరకూ కారి డార్ల పనులు పూర్తి చేసేందుకు 2018 డిసెంబర్‌ని గడువుగా నిర్దేశించుకున్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పరిశీలన స్థాయిలోనే నిలిచిపోయింది.

ఏఎంఆర్‌సీకి 245 ఎకరాలు..
ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చుకునేందుకు అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఏఎంఆర్‌సీకి ప్రభుత్వ భూములు అందించాలని సర్కారు నిర్ణయించింది. నగరంలోని 245 ఎకరాలు ఇచ్చేందు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చి న ఆదాయాన్ని సముపార్జించుకోనుంది. ఇప్పటికే పలు చోట్ల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూముల్ని గుర్తించారు. ముడసర్లోవలో 100 ఎకరాలు, మధురవాడ క్రికెట్‌ స్టేడియం సమీపంలో 2 ఎకరాలు, ఎన్‌వీపీ లా కాలేజీ ఎదురుగా 50 ఎకరాలు రెవిన్యూకి చెందిన భూములతో పాటు శిల్పారామం సమీపంలో 13 ఎకరాలు, టూరిజం శాఖకు చెందిన స్థలం, పరదేశీపాలెంలో రెవెన్యూ, జీవీఎంసీకి చెందిన 80 ఎకరాలు ఏఎంఆర్‌సీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా కొత్త ప్ర భుత్వం వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది.

ప్రారంభంలో ప్రతి స్టేషన్‌ నుంచి 10 నిమిషాలకో ట్రైన్‌

రద్దీని బట్టి.. ప్రతి రెండు నిమిషాలకో ట్రైన్‌ పరుగులు 

రెండు 750 వాట్స్‌ డీసీ కోచ్‌ 

డిపోలు ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన

విమానాశ్రయ ప్రాంతంలో ఒకటి, హనుమంతువాక వద్ద మరొక డిపో ఏర్పాటు

హైదరాబాద్‌ మెట్రో కంటే మిన్నగా...
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కంటే మిన్నగా విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఉండబోతుంది. అన్నింటికీ అనుకూలంగా.. ఇక్కడి వాతావరణానికి అనువుగా ప్రణాళికలు రూపొందించాం. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్తు అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థలం అందుబాటులో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలోని ట్రాఫిక్‌ పరిస్థితుల్ని అంచనా వేసి ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం. ప్రభుత్వం నిర్దేశించే మార్గంలో మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం.
– రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్‌ ప్రాజెక్టు ఎండీ

రాష్ట్రానికే ప్రతిష్టాత్మకం...
విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్, మెట్రో అవకాశాల్ని పరిశీలించిన తర్వాత సమగ్రమైన ప్రణాళికతో రూట్‌ మ్యాప్‌ని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సిద్ధం చేసింది.
– బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top