దాదాపు దశాబ్దకాలంగా డే ఎట్ సీ నిర్వహించని తూర్పు నౌకాదళం
ఏటా విశాఖ ప్రజలకు నిరాశే
2016 తర్వాత నౌకాదళ అద్భుతాలకు ప్రజలు దూరం
నౌకల్లో సాధారణ ప్రజల్ని తీసుకెళ్లి విన్యాసాలు ప్రదర్శించే ప్రక్రియని విస్మరిస్తున్న నేవీ
ఈ ఏడాది నేవీ డే విన్యాసాలూ ఉండే అవకాశం లేదంటున్న నౌకాదళవర్గాలు
2026లో జరిగే ఐఎఫ్‌ఆర్, మిలాన్, మహాసాగర్‌పైనే దృష్టిసారించిన నేవీ అధికారులు
సాక్షి, విశాఖపట్నం : నవంబర్ వచ్చిందంటే చాలు, విశాఖపట్నం నగరంలో నేవీ డే సంబరాలు మొదలవుతాయి. తూర్పు నౌకాదళం పాఠశాల విద్యార్థులకు యుద్ధ నౌకల సందర్శన అవకాశాలు కల్పించడం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, నేవీ బ్యాండ్ ప్రదర్శనలు వంటి కార్యక్రమాలతో సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా ఆర్‌కే బీచ్‌లో వారం రోజుల ముందు నుంచి నిర్వహించే నేవీ రిహార్సల్స్‌తో పాటు, ‘డే ఎట్ సీ’ పేరుతో నిర్వహించే కార్యక్రమం కోసం నగరవాసులే కాక, విశాఖకు వచ్చే సందర్శకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అయితే 2016 తర్వాత నుంచి ఈ ‘డే ఎట్ సీ’ కార్యక్రమం నగర ప్రజలకు దూరమైపోయింది. ఈసారి నౌకాదళ విన్యాసాలు కూడా చూసే అవకాశం లేదని తెలుస్తోంది. 2026 ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), మిలాన్ విన్యాసాలతో పాటు మహాసాగర్ (ఐవోఎన్‌ఎస్) సింపోజియంపై నేవీ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది నేవీ డేని సాదాసీదాగా నిర్వహించాలని భావిస్తున్నారు.
విశాఖ ప్రజలకు ఎమోషన్‌గా నేవీ డే
దాయాది దేశంపై సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా విశాఖలోనే నౌకాదళ దినోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుండటంతో, వైజాగ్ వాసులు ఆ రోజును, ఆ వేడుకలను తమ సొంత వేడుకలుగా భావిస్తుంటారు. నేవీ డే విన్యాసాలకు లక్షలాది జనం పోటెత్తి విజయవంతం చేస్తుంటారు. అందుకే వైజాగ్ ప్రజలకు తూర్పు నౌకాదళం నేవీ డే కానుకగా ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలను యుద్ధ నౌకల్లో సాగర జలాల్లోకి తీసుకెళ్లి, సముద్రం మధ్యలో విన్యాసాలను ప్రదర్శించేవారు. ఈ వేడుకలు చూసి వైజాగ్ ప్రజలు మురిసిపోయేవారు. దీంతో నేవీ డే ఎప్పుడు వస్తుందా, ‘డే ఎట్ సీ’ కి ఎప్పుడు వెళ్తామా అని ప్రజలు ఎదురుచూసేవారు. దురదృష్టవశాత్తు 2016 నుంచి వైజాగ్ వాసులకు ఈ గొప్ప అవకాశం దక్కడం లేదు.
వచ్చే ఏడాది మెగా విన్యాసాలపై దృష్టి
నేవీ డేకి 10 రోజుల ముందుగానే ఆర్‌కే బీచ్ పరిసరాలు యుద్ధ వాతావరణంతో గంభీరంగా కనిపించేవి. ప్రతి రోజూ వివిధ రకాల విన్యాసాలు చేసేవారు. తర్వాత, డిసెంబర్ 4కు ముందు నిర్వహించే రిహార్సల్స్ చూసేందుకు కూడా లక్షలాది సందర్శకులు వస్తుంటారు. కానీ, ఈసారి ఇవి కూడా ఉండే అవకాశం లేదని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలను కూడా సాధారణంగా నిర్వహించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం.. వచ్చే ఏడాది రెండు అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు ఉండటమే. 2026 ఫిబ్రవరి 15 నుంచి విశాఖ నగరం ప్రతిష్టాత్మక నౌకాదళ విన్యాసాలు, సదస్సులకు వేదికగా మారనుంది. ఫిబ్రవరి 15 నుంచి వారం రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మిలాన్–2026 విన్యాసాలు జరగనున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ విన్యాసాలు పూర్తయిన తర్వాత, మహాసాగర్ పేరుతో ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐవోఎన్‌ఎస్) సదస్సు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నిర్వహించనున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ విన్యాసాల నేపథ్యంలో, నేవీ డేని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమయం సరిపోదని నౌకాదళ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే, ఈసారి ఆర్‌కే బీచ్‌లో డిసెంబర్ 4న వేడుకలు సాధారణంగా నిర్వహించి, ఐఎఫ్‌ఆర్, మిలాన్ సమయాలలో అదరగొట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
ఐఎఫ్‌ఆర్ తర్వాతనిరాశే మిగిలింది
ప్రతి ఏటా నేవీ డే కోసం రెండు వారాల ముందు నుంచే ఆర్‌కే బీచ్ పరిసరాల్లో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఇవి ప్రతి సంవత్సరం ఆకట్టుకుంటున్నా, ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో నేవీ డేపై ప్రజల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతోంది. ‘డే ఎట్ సీ’ కోసం సుమారు ఆరు నౌకల వరకూ నేవీ సిబ్బంది ప్రజల్ని తీసుకెళ్లేందుకు వినియోగించేవారు. కానీ 2016 నుంచి ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్న నగర ప్రజలకు ప్రతి ఏటా నిరాశే ఎదురవుతోంది. 2016 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విజయవంతం కావడంతో, ఆ ఏడాది నవంబర్‌లో ‘డే ఎట్ సీ’ని ఘనంగా నిర్వహించారు.
వందలాది మంది ప్రజల్ని సముద్ర జలాల్లోకి తీసుకెళ్లి విన్యాసాలు చూపించారు. అయితే అదే ఇప్పటివరకు చివరి ‘డే ఎట్ సీ’గా మిగిలిపోయింది. 2017లో నేవీ డేకి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని తూర్పు నౌకాదళాధికారులు ప్రకటించారు. ఆ తర్వాత నుంచి స్పష్టమైన కారణాలు చెప్పకుండానే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ వచ్చారు.
2020లో కోవిడ్ కారణంగా విన్యాసాలకు కూడా స్వస్తి చెప్పారు. కేవలం నాలుగు యుద్ధ నౌకల్ని విద్యుత్ వెలుగుల్లో ఆర్‌కే బీచ్‌కు సమీపంలో ఉంచుతూ, నేవీ డే వేడుకల్ని ఎలాంటి రిహార్సల్స్ కూడా చూపించకుండానే ముగించారు. పరిస్థితులు సద్దుమణిగినా, నౌకాదళాధికారులు మాత్రం ‘డే ఎట్ సీ’ అంశాన్ని మరుగునపర్చారు.


