
సాక్షి, హైదరాబాద్: మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనే ప్రక్రియపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేసి వీలైనంత తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది.ఈ క్రమంలోనే చీఫ్‌సెక్రెటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆరి్థక, న్యాయ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మెట్రో మొదటి దశపైన ఎల్‌అండ్‌టీతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.
ఈ నివేదిక ఆధారంగా మెట్రో స్వాధీన ప్రక్రియను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎల్‌అండ్‌టీతో కలిసి నిరి్మంచిన మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నిర్వహణలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండోదశపైన కేంద్రం పలు సందేహాలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు ఎల్‌అండ్‌టీ పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఎల్‌అండ్‌టీ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆస్తులు, అప్పులు, మెట్రో నిర్వహణ, తదితర అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి నివేదికను రూపొందించనున్నారు.
కేబినెట్ సబ్‌కమిటీకి నివేదిక....
సాంకేతిక, న్యాయపరమైన అంశాలపైన ఈ కమిటీ దృష్టి సారించనుంది. అలాగే ఎల్‌అండ్‌టీకి వివిధ ప్రాంతాల్లో అప్పగించిన భూములను, ఆస్తులను స్వా«దీనం చేసుకోవడంతో పాటు ఆ సంస్థకు చెల్లించనున్న రూ.2000 కోట్ల చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలపైన కూడా సీఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ కార్యాచరణ రూపొందించనుందని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు తెలిపారు. ఎల్‌అండ్‌టి వైదొలగనున్న దృష్ట్యా రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఇప్పటికే ఎల్‌అండ్‌టీ నుంచి వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చిన మాల్స్, భూముల యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వానికి బదిలీ చేయవలసి ఉన్నది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూ ఈ ఆరి్థక సంవత్సరం ముగింపు నాటికి స్పష్టత వచ్చేవిధంగా చర్యలు చేపట్టనున్నారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీకి అందజేయనుంది.
రెండోదశకు మార్గం సుగమం...
మెట్రో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. పీపీపీ పద్ధతిలో కొనసాగే మొదటి దశకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరి్మంచనున్న రెండోదశకు మధ్య సరైన సమన్వయం కుదరకపోవడం వల్ల కేంద్రం పలు అంశాలను ప్రస్తావించింది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఈ అంశాలపైన కూడా దృష్టి సారించనుంది. ‘ఎల్‌అండ్‌టీ వైదొలగిన అనంతరం రెండో ప్రాజెక్టులు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తాయి.దీంతో ఇప్పుడు స్తబ్దత నెలకొన్న అన్ని అంశాలపైన కూడా స్పష్టత వస్తుంది.’ అని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు తెలిపారు.మొత్తం 8 మార్గాల్లో నిర్మించనున్న రెండోదశ పైన కేంద్రానికి డీపీఆర్‌లను సమరి్పంచి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీఎస్ కమిటీ అన్ని విధాలుగా ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేయగలదని భావిస్తున్నారు.
ఒక్క లైన్ పట్టాలెక్కినా చాలు..
నిజానికి రెండో దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలను 2028 నాటికి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేంద్రం నుంచి ఏ విధమైన సహకారం లభించకపోవడంతో తీవ్ర జాప్యమైంది. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టును స్వా«దీనం చేసుకోనున్న దృష్ట్యా మూడేళ్లలో రానున్న ఎన్నికల నాటికి ఏదో ఒక మార్గంలో మెట్రో కారిడార్‌ను నిరి్మంచాలని భావిస్తున్నారు. పాతబస్తీ రూట్‌లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కి.మీ.ల మార్గాన్ని చేపట్టి ఎన్నికల నాటికి కొంతమేరకు పురోగతి సాధించినా ఆశించిన ఫలితాలను పొందవచ్చునని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.