సాక్షి, హైదరాబాద్: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటరుగా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ రోజున ఈసీ సెలవు ప్రకటించింది. బీహార్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. మొదటి దశ: నవంబర్ 6, 2025 (గురువారం), ద్వితీయ దశ: నవంబర్ 11, 2025 (మంగళవారం), 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11, 2025న జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని విభాగం 135B ప్రకారం.. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఇతర ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, తాను ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఒక చెల్లింపు సెలవు (Paid Holiday) మంజూరు చేయాలని ఈసీ పేర్కొంది.


