కొండా సురేఖ వివాదం.. అస‌లేం జ‌రిగింది? | konda surekha controversy meenakshi natarajan call to minister | Sakshi
Sakshi News home page

కొండా సురేఖకి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ ఫోన్

Oct 16 2025 12:03 PM | Updated on Oct 16 2025 1:58 PM

konda surekha controversy meenakshi natarajan call to minister

మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. త‌న మాజీ ఓఎస్డీ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు క‌న‌బ‌డుతోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించిన సురేఖ ఓఎస్డీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు స‌ర్కారు య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వ‌చ్చిన పోలీసుల‌ను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది. త‌మ‌ను టార్గెట్ చేశార‌ని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం న‌డుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.

మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారం గురించి త‌న‌కేమీ తెలియ‌ద‌ని మంత్రి సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి హ‌న్మ‌కొండ‌లో చెప్పారు. త‌మ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను క‌లిసి వివాదం ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. అదే స‌మ‌యంలో త‌న కూతురును ఆయ‌న వెన‌కేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అటు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవ‌హరించిన తీరు ప‌ట్ల సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖ‌ను ఆమె నుంచి తీసేసుకోవాల‌న్న యోచ‌నలో ఉన్న‌ట్టు సమాచారం.

అస‌లేం జ‌రిగింది? 
త‌న‌ నియోజ‌క‌వ‌ర్గం హుజూర్‌న‌గ‌ర్‌లోని డెక్క‌న్ సిమెంట్స్‌లోని ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తిని డ‌బ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ బెదిరించిన‌ట్టు మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయ‌డంతో అత‌డిని విధుల నుంచి ప్ర‌భుత్వం త‌ప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల‌ని పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అత‌డు సురేఖ ఇంట్లో ఉన్నాడ‌న్న స‌మాచారంతో బుధ‌వారం రాత్రి అక్క‌డికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయ‌త్రిహిల్స్‌లోని త‌మ‌ ఇంటికి మ‌ఫ్టీలో వ‌చ్చిన‌ పోలీసుల‌ను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వ‌స్తారంటూ ప్ర‌శ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్‌ బ‌య‌టికి వ‌చ్చి కారులో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.  

మా ప్ర‌మేయం లేదు
ఈ నేప‌థ్యంలో మేడారం జాత‌ర ప‌నుల‌ను రోడ్లు భ‌వ‌నాల‌కు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి నిరాక‌రించారు. డెక్క‌న్ సిమెంట్ వివాదంలో త‌న ప్ర‌మేయం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవ‌హారంలో త‌న‌పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖైర‌తాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్క‌న్ సిమెంట్ వివాదంలో త‌న ప్ర‌మేయం లేద‌ని అన్నారు.

తెలంగాణ కేబినెట్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జ‌ర‌గ‌నుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీల‌క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌ని స‌మాచారం. కొండా సురేఖ వివాదం నేప‌థ్యంలో కేబినెట్ భేటీపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. కాగా, సురేఖకి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. 

చ‌ద‌వండి: న‌న్ను తిట్టినవాళ్లే నాకోసం వ‌స్తున్నారు

పొంగులేటిపై ఫిర్యాదు!
అంత‌కుముందు మేడారం పనుల‌ టెండ‌ర్ల విష‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిపై జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. త‌న శాఖ‌కు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన ప‌నుల‌ను త‌న‌వాళ్ల‌కు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సురేఖ ఆరోపించిన‌ట్టు తెలుస్తోంది. అప్ప‌టి నుంచి పొంగులేటితో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ఆమె దూరంగా ఉంటున్నారు. 

మహేష్ గౌడ్ క్లారిటీ
మంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవ‌హారాన్ని తాను మీనాక్షి న‌ట‌రాజ‌న్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొంద‌ర‌లో క్లారిటీ వస్తుంద‌ని మీడియా ప్ర‌తినిధుల‌తో చెప్పారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement