మంత్రి మెప్పుకోసం.. గిరిజనుల ఆరోగ్యం తాకట్టు | Pilot Project Added 30Years Old Boar Pipeline In Vizianagaram | Sakshi
Sakshi News home page

మంత్రి మెప్పుకోసం.. గిరిజనుల ఆరోగ్యం తాకట్టు

Jun 25 2018 12:26 PM | Updated on Jun 25 2018 12:26 PM

Pilot Project Added 30Years Old Boar Pipeline In Vizianagaram - Sakshi

వైద్యం అందడం లేదని ఆరోపిస్తున్న మహిళలు

బొబ్బిలి: రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు మెప్పు కోసం గిరిజనుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు మున్సిపల్‌ అధికారులు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని పాత పథకాలకే మెరుగులు దిద్దిన యంత్రాంగం తీరుతో మున్సిపాలిటీ పరిధిలోని రామందొరవలసలో కలుషిత నీటిని తాగి ఇటీవల ఒక గిరిజనుడు మృతి చెందారు. మరికొంతమంది తీవ్ర అస్వస్థత పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకోలేదు. కనీసం గ్రామంలో వైద్యశిబిరం కూడా నిర్వహించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 మందికి పైగా డయేరియా బాధితులున్నారు. బొబ్బిలి ఆస్పత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

మంత్రి మెప్పుకోసం అధికారులు చేసిన ఈ పనికి గ్రామస్తులు చావులను కొనితెచ్చుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రి చేతుల మీదుగా త్వరితగతిన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో మున్సిపల్‌ అధికారులు పాత శునకాల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సల షెడ్లతో పాటు రామందొరవలస గిరిజన గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ ఆదరాబాదరాగా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ట్యాంకు, మోటారు అమర్చాల్సి ఉండగా ఎప్పుడో 30 ఏళ్ల నాటి పాత బోరుకున్న హెడ్‌ తీసేసి దానికి మోటార్‌ బిగించి ట్యాంకును, ట్యాపులను ఏర్పాటు చేసి హడావిడిగా పైలట్‌ ప్రాజెక్ట్‌ను మంత్రి చేతుల మీదుగా కొద్ది రోజుల కిందట ప్రారంభించేశారు. మంత్రి ప్రారంభించాలన్న ఒకే లక్ష్యంతో ఆదరాబాదరాగా చేసిన ఈ పనుల్లో ట్యాంకును శుభ్రం చేయలేదు. పైపెచ్చు ఎప్పుడో 30 ఏళ్ల నాటి బోరుకే మోటారు బిగించేసి వదిలేశారు. దీంతో తాగునీరు కలుషితమై గిరిజనులకు రోగాల భారిన పడ్డారు. 

పైప్‌లైన్‌ కట్‌చేసి వదిలేసిన అధికారులు..
గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు గ్రామానికి వెళ్లి టాంకులోని నీళ్లను పారబోశారు. బోరు కనెక్షన్‌ కట్‌ చేశారు. మామూలుగా నీరు పట్టుకున్నట్లు పాత బోర్లనుంచే నీరు పట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చి వచ్చేశారు. ఆ  నీరు పారబోసినపుడు పెద్ద పురుగులు వచ్చాయని, వాటిని తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పైప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ సింహాచలం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement