తుపాను తాకిడికి జిల్లా వ్యవసాయ రంగం భారీ నష్టాన్నే చవిచూసింది. గత నెలలో నాలుగు రోజులపాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తుపాను తాకిడికి జిల్లా వ్యవసాయ రంగం భారీ నష్టాన్నే చవిచూసింది. గత నెలలో నాలుగు రోజులపాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టంపై జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు తయారు చేసిన నివేదికల్లో 73,549 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. వీటిలో 34,302 ఎకరాల్లో పత్తి, 10,170 ఎకరాల్లో వరి, 23,640 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పాడయ్యాయి. అదేవిధంగా మరో 2,418 ఎకరాల్లో ఆముదం, జొన్న తదితర పంటలున్నాయి. మరో 3,019 ఎకరాల్లో క్యారెట్, టమాటా పంటలు దెబ్బతిన్నాయి.
రూ.30కోట్లకు పైమాటే!
పంట నష్టం అంచనాలను గుర్తించిన అధికారులు వీటికి వ్యయ రూపంలో అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. పత్తి, వరి పంట హెక్టారుకు రూ.10వేల చొప్పున, మొక్కజొన్నకు రూ.8,300 చొప్పున లెక్కిస్తున్నారు. అదేవిధంగా జొన్న, ఆముదం పంటలకు ఎకరాకు రూ.5వేలు, ఉద్యాన పంటలకు కేటగిరీ వారీగా ధరలు నిర్ధారిస్తూ గణాంకాలు రూపొందిస్తున్నారు. ఈ లెక్కన నష్టం రూ.30కోట్లకు చేరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ నష్టం గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనాలపై తుది నివేదికలు మరో వారం రోజుల్లో తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు పూర్తిస్థాయి లెక్కలను జిల్లా వ్యవసాయ శాఖకు అందించలేదు. మరో వారం రోజులపాటు సాగే ఈ పరిశీలనలో గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ఐదు ఎకరాలకు పైగా సాగు చేసిన రైతుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయా రైతుల నష్టం వివరాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలే దు. ఈ నేపథ్యంలో ఆయా రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. వీరి అంచనాలు పరిగణనలోకి తీసుకుంటే నష్టం పెరగనుంద ని అధికారవర్గాలు చెబుతున్నాయి.