టెట్‌ను రద్దు చేస్తారా.. దూకేయమంటారా ?

PET Tet Candidates Trying To Jump From Water Tank In Prakasam - Sakshi

ఒంగోలులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎక్కి టెట్‌ పీఈటీ అభ్యర్థుల నిరసన

ఐదు గంటల పాటు ఉత్కంఠ

పోలీసుల చొరవతో ఆందోళన విరమణ

ఒంగోలు: అక్రమాల టెట్‌ను రద్దు చేస్తారా..లేక ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌పై నుంచి కిందకు దూకేయమంటారా..అంటూ దాదాపు 100 మంది పీఈటీ టెట్‌ అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో ఒన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని దిగిరావాలంటూ సూచించారు. 

టీడీపీ నాయకురాలితో వాగ్వాదం
ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేయడం సరికాదని, సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు అందరు దిగి రావాలంటూ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంలో అభ్యర్థులు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకురాలు ఒకరు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడుదాం రండి.. అంటూ సూచించారు. ఈ క్రమంలో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. తమ ఓట్ల కోసం  ఇళ్లకు వస్తారు.. ఇంతమందిమి ఆందోళన చేస్తుంటే వచ్చి తమ సమస్యను వినేందుకు ఓపిక లేదా.. ఎమ్మెల్యే అయినా.. ఎమ్మెల్సీ అయినా.. మంత్రి అయినా ఇక్కడకే రావాలంటూ పట్టుబట్టారు. జిల్లాలో 1200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. నిజంగా తమ సమస్య పరిష్కారం కోరుకునే వారే అయితే తమకు సంఘీభావంగా తమతో పాటు బైఠాయించి ప్రజానాయకులను రప్పించి హామీ ఇప్పించాలని పట్టుబట్టారు. 

ముందస్తు జాగ్రత్తలో పోలీసులు
ఒక వైపు మహిళా నాయకురాలితో అభ్యర్థులు మాట్లాడుతుండగానే పోలీసులు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌పైకి చేరుకున్నారు. అభ్యర్థులకు నచ్చజెప్పి కిందకు దింపేందుకు యత్నించారు. అభ్యర్థులు మెట్ల మీదనే బైఠాయించి దిగకపోవడంతో పోలీసులు కూడా చేసేది లేక దిగువవున ఉన్న వారితో చర్చలు మొదలు పెట్టారు. అభ్యర్థులు మీడియా ఎదుట తమ సమస్యను ఏకరువు పెట్టారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రకారం పీఈటీ అభ్యర్థులకు టెట్‌ ఉండదన్నారు. కేంద్రం స్థాయిలో సైతం కేవలం సిటెట్‌ మాత్రమే ఉంటుందని, ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే మరోమారు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నూతనంగా టెట్‌ అనే పరీక్ష తీసుకొచ్చి దానికి వెయిటేజీ నిర్ణయించి నిరుద్యోగులను దగా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్‌ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని, దానికి వెయిటేజీ కేటాయించడంలోనే అక్రమాలకు మార్గం సుగమం అయిందన్నారు. వెయిటేజీ కోసం టెట్‌ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ నిరుద్యోగి రూ.500 పరీక్ష ఫీజు, అప్‌లోడింగ్‌ కోసం కంప్యూటర్‌ సెంటర్లలో వంద రూపాయలతో పాటు కోచింగ్‌ కోసం కోచింగ్‌ సెంటర్లకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, మరో వైపు ఉపాధి కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఇబ్బందులు చాలవన్నట్లు ఈ నెల 19న జరగాల్సిన పీఈటీ టెట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో రావడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రధానంగా ఒక పీఈటీ రింగ్‌ లీడర్‌గా వ్యవహరించి ఎవరైతే అక్రమంగా పరీక్షలో పూర్తిస్థాయి మార్కులు రావాలని భావించారో వారికి తమిళనాడులో ఒకే సెంటర్‌ వచ్చేలా చేశారని, తద్వారా తాము ఎంత బాగా రాసినా లీకైన పేపర్‌ ద్వారా వారు పూర్తి మార్కులు సాధించి డీఎస్సీలో ఉద్యోగాలన్నీ కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలోని సెంటర్లకు దరఖాస్తు చేసుకున్న ఏపీ పీఈటీ అభ్యర్థులకు ఏపీలోని సెంటర్లనే కేటాయించాలని, గతంలో కేటాయించిన ప్రశ్నపత్రాన్ని మార్చి వేసి నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. టెట్‌కు వెయిటేజీని రద్దు చేయాలన్నారు. టెట్‌ నోటిఫికేషన్, టెట్‌ పరీక్షకు మధ్య సమయం కూడా పెంచాలంటూ నినాదాలు చేశారు.

ఎట్టకేలకు ఆందోళన విరమణ
సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు చివరకు ఫలించాయి. తొలుత జేసీతో మాట్లాడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తీరా ఆమె కూడా అందుబాటులో లేరని తెలియడంతో మరోసారి అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పోలీసులు కూడా గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తో మాట్లాడించేందుకు అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌పై నుంచి దిగి వచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top