ఇందిరమ్మకు బ్రేక్! | peoples are concern on chandrababu ruling | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు బ్రేక్!

Jul 26 2014 2:46 AM | Updated on Sep 2 2017 10:52 AM

ఒకవైపు రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ చేయకుండా డ్రామాలాడుతున్న ప్రభుత్వం. మరోవైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వీధిన పడేసేయత్నంలో ఉంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఒకవైపు రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ చేయకుండా డ్రామాలాడుతున్న ప్రభుత్వం. మరోవైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వీధిన పడేసేయత్నంలో ఉంది. ఇప్పడేమో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కన్నేసింది. సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో రోజుకో వర్గం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాబు అనుసరిస్తున్న విధానాలతో ఎవరికీ మనశ్శాంతి లేకుండాపోతోంది.  ఇందిరమ్మ పథకం కింద ఇప్పటికే మంజూరై ప్రారంభించని ఇళ్లను రద్దు చేసే యోచనలో ఉన్న సర్కార్,  పనులు ప్రారంభించిన ఇళ్లకు బిల్లులు కూడా నిలిపేసింది.
 
ఆ పనులను ఎక్కడికక్కడ  ఆపేయాలని పరోక్షంగా ఆదేశించింది. దీంతో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.33 కోట్ల బిల్లులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎప్పటిలోగా చెల్లిస్తామన్నది కూడా చెప్పలేదు. అధికారులకు అందిన సంకేతాల ప్రకారం వచ్చే మార్చి వరకు చిల్లి గవ్వ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఇరకాటంలో పడ్డారు. ప్రభుత్వ పరోక్ష ఆదేశాలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మాణం చేపడితే బిల్లులు రావేమోనని, నిర్మించకుండా అర్ధాంతరంగా వదిలేస్తే అప్పటివరకు చేపట్టిన నిర్మాణాలు శిథిలమవుతాయేమోనన్న బెంగ పట్టుకుంది.
 
జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన సుమారు ఐదువేల ఇళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. మరో ఐదు వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించని ఇళ్లను రద్దు చేసే ఆలోచనలో ఉంది. నిర్మాణ దశలో ఉన్న ఐదు వేల ఇళ్ల బిల్లులను నిలిపేయాలని సూచనప్రాయ ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసే కార్యక్రమం పూర్తయ్యేవరకు ముందుకెళ్లొద్దని హౌసింగ్ అధికారులకు సూచించింది.
 
జియో ట్యాపింగ్ విధానం ద్వారా ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్రమాలను గుర్తించనున్నామని, డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని ఇప్పటికే సంబంధిత మంత్రి కిమిడి మృణాళిని స్పష్టం చేశారు. ఈప్రక్రియ పూర్తయి నివేదిక వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలను నిలిపేయాలని పరోక్షంగా ఆదేశించింది. తదనంతర చర్యలు తీసుకున్న తర్వాతనే పెండింగ్ బిల్లుల చెల్లింపులంటూ సంకేతాలు పంపించింది. ఇదంతా వచ్చే ఏడాది మార్చి వస్తే తప్ప పూర్తయ్యేది కాదని, అంతవరకు వేచి ఉండాల్సిందేనని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
 
ఇప్పటికే లబ్ధిదారులకు రూ.33 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. వీటి కోసమే ఎదురు చూస్తున్న సమయంలో ఇంతవేగంగా చెల్లింపులే జరగవనే వార్తలు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పట్లో సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వ సాయంతో ఇళ్లు కట్టుకునేందుకు దిగిన లబ్ధిదారులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.

చెల్లింపుల విషయాన్ని పక్కన పెడితే నిర్మాణాలనే ఎక్కడికక్కడ ఆపేయాలని పరోక్షంగా చెప్పడంతో అసలు గ్రాంటు వస్తుందో లేదోనని భయపడుతున్నారు. ఒకవేళ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేస్తే అప్పటికే పూర్తయిన నిర్మాణాలు శిథిలమైపోతాయని భయపడుతున్నారు. ప్రభుత్వం టసాయం ఆశించకూడదనుకుంటే అప్పోసప్పో చేసి పూర్తి చేయా ల్సి ఉంటుంది. అదే జరిగితే లబ్ధిదారులకు అప్పులపాలుకాకతప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement